కేశినేని రాజకీయ సూసైడ్...!
రాజకీయాల్లో హత్యలు ఉండవు..ఆత్మహత్యలే ఉంటాయని చెబుతుంటారు. నిజంగా అలాంటి రాజకీయ ఆత్మహత్యే నేడు విజయవాడలో జరిగింది. వరుసగా రెండుసార్లు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన కేశినేని నాని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన వైకాపా నుంచి పోటీ చేసి స్వంత సోదరుడి చేతిలో ఘోరపరాజయానికి గురయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపిలో ఉన్న కేశినేని నాని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌పై పలు విమర్శలు చేసి వైకాపాలో చేరారు. అమరావతి అనేది చంద్రబాబు కల అని, తనకు విజయవాడ అభివృద్ధి ముఖ్యమని, జగన్ విజయవాడను బాగా అభివృద్ధి చేశారని చెబుతూ వైకాపాలో చేరి ఎన్నికల్లోపోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. 2014, 2019ల్లో ఆయన విజయవాడ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పదేళ్లపాటు విజయవాడ ఎంపిగా ఉన్న కేశినేనినాని విజయవాడ అభివృద్ధికి బాగానే కృషి చేశారనే పేరును సంపాదించుకున్నారు. కనకదుర్గ ప్లైఓవర్, బెంజ్‌సర్కిల్ ప్లైఒవర్లు ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. అదే విధంగా టాటా సంస్థలను రప్పించి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయించారు. అయితే..ఎంత అభివృద్ధి చేసినా టిడిపి అధినేత చంద్రబాబునాయుడును, ఆయన కుమారుడ్ని చులకనగా చూడడంతో ఆయనకు టిడిపిలో సీటు దక్కలేదు. విజయవాడలో తాను గెలిచానంటే..తన వ్యక్తిగత బలమే తప్ప ఇందులో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, అదీ చంద్రబాబుకు అసలే సంబంధం లేదనేది ఆయన నమ్మకం. తాను ఏ పార్టీలోచేరినా స్వంత బలంతో గెలుస్తానని ఆయన ప్రగల్భాలు పలికేవారు.
వాస్తవానికి 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఆరు స్థానాల్లో టిడిపి ఓడిపోయినా ఎంపిగా తాను గెలిచానని, ఇది తన స్వంత బలంతోనే సాధించాలనని, టిడిపి పార్టీతో కాదనేది ఆయన భావన. అదే భావంతో ఆయన టిడిపి అధినేత చంద్రబాబుతోనూ, ఆయన కుమారుడితోనూ, ఇతర జిల్లా టిడిపి నాయకులతోనూ వ్యవహరించారు. టిడిపికి తాను తప్ప మరో దిక్కులేదని, తనకే పిలిచి సీటు ఇస్తారని ఆయన భావించారు. అయితే..తాము ఎంత సర్ధుకున్నా..నాని వ్యవహారశైలి మారకపోవడంతో చంద్రబాబు ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని ప్రోత్సహించారు. టిడిపి టిక్కెట్ ఆయనకు ఖరారు చేశారు. దీంతో అగ్నిమీదగుగ్గిలమైన కేశినేని నాని వెంటనే వైకాపాలోచేరారు. చేరి వెంటనే జిల్లాలో 90శాతం టిడిపిని ఖాళీ చేయిస్తానని, విజయవాడ పార్లమెంట్ పరిథిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా టిడిపికి రానీయనని శపథం చేశారు. అయితే..ఆయన శపధాలు ఇక్కడ ఫలించలేదు. టిడిపి అభ్యర్థి తన సోదరుడు అయిన చిన్ని చేతిలో నాని ఘోరపరాభవానికి గురయ్యారు. అంతే కాదు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా వైకాపాకు రాలేదు. దీంతో తీవ్ర అవమానానికి గురైన నాని రాజకీయసన్యాసం తీసుకుంటున్నానని ప్రకటించారు. వాస్తవానికి నానికి తొందరపాటు మనిషి అని, తాను అనుకున్నదే చేయాలనే మొండితత్వం ఉందని, అహంకారం, ఇతరులపట్ల చులకనభావంతో ఉంటారని, అదే ఆయన కొంపముంచిందని రాజకీయపరిశీలకుల అభిప్రాయం. ఆయన కొంత సమయస్పూర్తిని ప్రదర్శించి ఉంటే..ఇప్పుడు కేంద్రంలో మంత్రి అయ్యేవారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన టిడిపిలో ఉంటే విజయవాడ నుంచి మరోసారి గెలిచేవారని, ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్‌కు వచ్చిన మంత్రిపదవి నానికి వచ్చేదనని, కానీ ఆయన తొందరపాటు, చులకన వ్యవహారాలు ఆయనను దెబ్బతీశాయని, రాజకీయాల్లో ఇటీవల కాలంలో చూస్తోన్న రాజకీయ సూసైడ్ ఇదేనని పలువురు చెబుతున్నారు. కాగా విజయవాడ నుంచి వైకాపా తరుపున ఎవరు పోటీ చేసినా..వారంతా రాజకీయంగా చావుదెబ్బ తిన్నారని చరిత్ర చెబుతోంది. దానికి నిదర్శనం ఏమిటంటే 2014లో వైకాపా తరుపున పోటీ చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్, 2014లో పోటీ చేసిన వరప్రసాద్‌లు ఆ తరువాత రాజకీయంగా తెరమరుగైపోయారు. ఇప్పుడు కేశినేని నాని వంతు. ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి వారి దారిలోనే నడిచారు.