మళ్లీ వైకాపా ఫేక్ ప్రచారం...!
ప్రజలు అత్యంత ఘోరంగా ఓడించినా వైకాపా నేతలకు, కార్యకర్తలకు బుద్ధి రావడం లేదు. ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేసి, అదే నిజమని ప్రజలను నమ్మించడంలో పిహెచ్‌డి చేసిన వైకాపా మళ్లీ అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని తెగ తాపత్రయపడిపోతోంది. అధికారంలో ఉన్నప్పూడూ, లేనప్పూడూ వైకాపాది అదే తీరు. ఎన్నికల్లో ఓడి పదిరోజులు కాకముందే మరోసారి ఫేక్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. చంద్రబాబు మంత్రివర్గంలో 15 మంది కమ్మ కులస్తులు ఉన్నారంటూ వైకాపా తాజాగా ప్రచారం చేస్తోంది. తన స్వంత కులస్తులను 15 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా చేశారంటూ ఆ పార్టీ అధికార ఛానెల్‌లో ప్రచారం చేస్తోంది. వాస్తవానికి చంద్రబాబు మంత్రివర్గంలో కమ్మలు నలుగురే ఉన్నారు. అయితే 15 మంది ఉన్నారంటూ వైకాపా ఛానెల్‌లోనూ, ఆ పార్టీ సోషల్ మీడియాలోనూ వండివారుస్తున్నారు. చంద్రబాబు తన మంత్రివర్గంలో నలుగురు కమ్మలు, నలుగురు కాపులు, ముగ్గురు రెడ్డులు, ఎనిమిది మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక మైనార్టీ, ఒక ఎస్టీ, వైశ్యవర్గానికి ప్రాతినిధ్యం కల్పించారు. వాస్తవం ఇది కాగా..పదిహేను మంది కమ్మలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ అసత్య ప్రచారాలను వైకాపా మొదలుపెట్టింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో అన్ని వర్గాలకు, మతాలకు, కులాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం దక్కింది, మంచి మంత్రివర్గ కూర్పు అనే భావన ప్రజల్లోనూ రాజకీయవర్గాల్లోనూ వ్యక్తం అవుతుండగా, వైకాపాకు, ఆ పార్టీ ఛానెల్‌కు మాత్రం పదిహేను మంది కమ్మ మంత్రులు కనిపించడం విచిత్రం.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కులాలకు అసలు మంత్రివర్గంలోనే స్థానం ఇవ్వలేదు. రాష్ట్ర జనాభాలో దాదాపు 5శాతం ఉన్న కమ్మ కులస్థులకు మంత్రివర్గంలో స్థానమే లేదు. అదే విధంగా కాపు సామాజికవర్గానికి కూడా తగినంత న్యాయం జరగలేదు. జగన్ సిఎంగా పదవీబాధ్యతలు చేపట్టిన వెంటనే తండోప తండాలుగా తన సామాజికవర్గానికి చెందిన వారి కీలక పదవుల్లో నియమించుకున్నారు. పాలనలో కీలకమైన ప్రభుత్వకార్యదర్శితో పాటు అన్ని ముఖ్యమైన పదవుల్లో తన వారితో నింపేశారు. వారు చేసినట్లే అందరూ చేస్తారని, వారు చేసిన దాన్ని ఇతరులకూ ఆపాదిస్తూ ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలన తప్పుదోవ పట్టించాలనే ధ్యేయంతో ఇటువంటి ఫేక్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడే కాదు 2014లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 32 మంది కమ్మ డిఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చారంటూ సాక్షాత్తూ జగనే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అయితే..అదంతా అత్యమని జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వారి హోంమంత్రే అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు. ఇదొక్కటేనా తిరుమల వెంకన్న పింక్‌డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని, అమరావతి గ్రాఫిక్స్ అని, పోలవరం, పట్టిసీమ కట్టలేదని ఒకటేమిటి...? సవాలక్ష ఫేక్ ప్రచారాలతో నాటి టిడిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచేసింది. ఇప్పుడు కూడా మళ్లీ అదే దారిలో ఫేక్ ప్రచారాన్ని మొదలెట్టింది. ఫేక్ ప్రచారంలో మాస్టర్ డిగ్రీ చేసిన వైకాపాను గతంలో వదిలేసినట్లు చంద్రబాబు వదిలేస్తే మరోసారి ఆయన, ఆయన కుమారుడు ఘోరంగా దెబ్బతింటారు. సోషల్‌మీడియా ఫేక్ ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టకపోతే...టిడిపి కోలుకోలేని విధంగా నష్టపోతారు.