ఐఏఎస్ అధికారులు పాఠం నేర్చుకుంటారా...!?
రాష్ట్రానికి చెందిన అఖిల భారత సర్వీస్ అధికారుల తీరుపై గత ఐదేళ్లుగా ఎంతో చర్చజరిగింది. అధికార పార్టీకి వంతపాడుతూ, వ్యవస్థలను నాశనం చేయడంలో కొందరు ఐఏఎస్ అధికారులు ప్రముఖ పాత్రపోషించారని, అధికారంలో ఉన్నవారి మెప్పుపొందడానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అవినీతికి, అక్రమాలకు సహకరించారని, ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం ప్రాకులాడారనే విమర్శలు వారిపై బలంగా వచ్చాయి. ఇలా వ్యవహరించిన వారిలో సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్, ఐఆర్ ఎస్ అధికారులు ఉన్నారు. ప్రభుత్వాలు మారిన వెంటనే వీరు ఆదాయం వచ్చేపోస్టుల కోసం, ఉన్నత పదవుల కోసం ఆయా ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నేరుగా ఐఏఎస్ పదవులు పొందిన వారు కూడా దీనిలో ఉండడం విశేషం. గత జగన్ ప్రభుత్వంలో ఇలా వ్యవహరించిన అధికారులపై నేడు నూతనంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ అరాచకాలకు, అక్రమాలకు సహకరించిన ఐఏఎస్ అధికారుల మొహం చూడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. మీ వ్యవహారశైలితో వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆయన ఆక్షేపించారు. ఇలా వ్యవహరించిన అధికారులను వదిలేది లేదని, వారందరిపై చర్యలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.
గత జగన్ ప్రభుత్వంలో కొందరు ఐఏఎస్‌లు మితిమీరిన ప్రభుభక్తిని ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారిలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ఇద్దరు సీనియర్ మహిళా అధికారిణులు ఉన్నాయరు. వీరిలో ఒకరు సిఎస్ పోస్టు కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను సాక్షాత్తూ భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మతో పోల్చారట. మీరు శ్రీకృష్ణుడంతటి వారు..నేను మీ సోదరిగా చెబుతున్నాను..మరో 30ఏళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారని చెబుతూ జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారట. ఆమె తీరుతో అక్కడ ఉన్నవాళ్లందరూ ఆశ్చర్యపోయారట. ఒకప్పుడు ఆమెకు నిజాయితీపరురాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారనే పేరు తెచ్చుకున్న ఆమె కావడమే వారి ఆశ్చర్యానికి కారణమట. ఈమేమిటి ఇలా..తయారైంది..గతంలో ఎలా ఉండేదో..అంటూ..ఆమె నిర్వాకంపై ఎద్దేవా చేశారట. ఎంతటి వారైనా అధికారానికి, డబ్బుకు లొంగుతారని ఆమెను చూస్తేనే తెలుస్తుందని కూడా గుసగులకుపోయారట. ఆమె భజనకు మెచ్చిన జగన్ తరువాతా ఆమెను సిఎంఓలోకి తీసుకున్నారు. ఈమె ఒక్కరే కాదు..విద్యాశాఖను చూసిన అధికారి సంగతి చెప్పనవసరం లేదు. అదే విధంగా పంచాయితీరాజ్‌శాఖ నిర్వహించిన వారు, మున్సిపల్, గనులు, ఐ అండ్ పిఆర్, ఎక్సైజ్‌శాఖ, ఆర్ధికశాఖ, రెవిన్యూశాఖ, పోలీస్‌బాస్‌లు ఒకరేమిటి దాదాపు 80శాతం మంది అధికారులు అప్పటి పాలకులకు ఊడిగం చేశారు. ఇలా ఊడిగం చేసిన అధికారులు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందు దోషులుగా నిలబడాల్సి వచ్చింది. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా..నిబంధనల మేరకు పనిచేస్తే తరువాత ఇబ్బందులు వచ్చేవి కాదు. కానీ తమ స్వలాభం కోసం వీరు యధేచ్ఛగా నిబంధనలను తోసిరాచని ప్రభుత్వ పెద్దల అరాచకాలకు, అక్రమాలకు, అవినీతికి సహకరించారు. ఇలా సహకరించిన అధికారులు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలతోపాటు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. యువ ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు, ఇతర సర్వీస్‌లకు చెందిన వారు వీరి వ్యవహారాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.