లేటెస్ట్

I&PR దొంగ‌ల‌ను ‘కొలుసు’ ప‌ట్టేస్తారా...?

రాష్ట్రంలో నూత‌న ప్ర‌భుత్వం కొలువుదీర‌డంతో..అవినీతి అధికారుల‌కు, అవినీతి ఉద్యోగుల‌కు ముచ్చెమ‌ట‌లు పోస్తున్నాయి. గ‌త వైకాపా ప్ర‌భుత్వ హ‌యాంలో ఇష్టారాజ్యంగా అవినీతికి, అక్ర‌మాల‌కు, అరాచ‌కాల‌కు పాల్ప‌డిన అధికారులు ఇప్పుడు త‌మ‌ను ఎక్క‌డ ప‌ట్టేసుకుంటారోనన్న భీతి వారిలో క‌నిపిస్తోంది. జ‌గ‌న్ అధికారం శాశ్వ‌త‌మ‌ని న‌మ్మిన వీరు, అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించారు. రేప‌నేది ఒక‌టుంద‌నే విష‌యాన్ని మ‌రిచి య‌ధేచ్ఛ‌గా దోపిడీకి పాల్ప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భుత్వంలోని ప్ర‌తిశాఖ‌లోనూ దాదాపు ఇదే విధంగా జ‌రిగింది. అయితే..రాష్ట్ర స‌మాచార‌శాఖ‌లో ఇది మ‌రీ మితిమీరిపోయింది. స‌మాచార‌శాఖ క‌మీష‌న‌ర్ జ‌గ‌న్ కు క‌ట్టు బానిస‌లా వ్య‌వ‌హ‌రించారు. అధికార పార్టీ ఆడ‌మ‌న్న‌ట్లు ఆడారు. జ‌గ‌న్‌కు చెందిన ప‌త్రిక‌కు, జ‌గ‌న్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన అవుట్‌డోర్ యాడ్ ఏజెన్సీకి వంద‌ల కోట్లు దోచిపెట్టారు. ఈ దోపిడీపై ఇప్ప‌టికే ప‌లువురు ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేశారు. అయితే సిఎం స్థాయిలో జ‌రిగిన అవినీతి క‌నుక దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ చేయాల‌నే త‌లంపుతో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఉంది. అయితే..క‌మీష‌న‌ర్‌ను అడ్డుపెట్టుకుని పెత్త‌నం చేసిన అధికారుల సంగ‌తి తేల్చాల‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు ప‌లువురు నూత‌న స‌మాచార‌శాఖ మంత్రిని కోరుతున్నారు. వంద కోట్లు అవుట్‌డోర్‌, ఢిల్లీకి చెందిన కొన్ని అనామ‌క ప‌త్రిక‌ల‌కు క‌ట్ట‌బెట్టిన వైనంలో క‌మీష‌న‌ర్‌తోపాటు, ఆ శాఖ‌కు చెందిన కీల‌క అధికారులు కూడా భాగ‌స్వాములుగా ఉన్నారు. క‌మీష‌న‌ర్‌కు వ‌చ్చిన ముడుపులు ఎంతో..కీల‌క అధికారుల‌కు వ‌చ్చిన ముడుపుల భాగ‌స్వామ్యం ఎంతో తేల్చాల్సి ఉంది. 


రాష్ట్ర స‌మాచార‌శాఖ‌లో ఇ-ఆఫీస్‌ను అమ‌లు చేయ‌కుండా అడ్డుకున్న‌దెవ‌రో..తేల్చాల్సి ఉంది. అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్ర‌తి కార్యాల‌యంలో ఇ-ఆఫీస్‌తోనే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించినా..స‌మాచార‌శాఖ‌లో అది అమ‌లు కాలేదు. కాగితాల‌తో ఫైల్స్‌ను న‌డిపించారు. మ్యాన్‌వ‌ల్‌గా న‌డిచిన ఫైల్స్‌ను కొంద‌రు అధికారులు మాయం చేశార‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కొన్ని ఫైల్స్‌ను కొంద‌రు అధికారులు రెండో కంట‌ప‌డ‌కుండా న‌డిపించార‌ని, శాఖ‌లో ఇత‌ర అధికారుల సంత‌కాలు లేక‌పోయినా, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉన్నా వాటిని ఆమోదించి పెద్ద ఎత్తున ఆస్తుల‌ను కూడ‌బెట్టుకున్నార‌ని, ఇప్పుడు అటువంటి వారి బండారం బ‌య‌ట‌పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. అదే విధంగా స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం కింద గ‌త ఐదేళ్ల‌లో ఎవ‌రికీ ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని, ఇది అతి పెద్ద త‌ప్పు అని, సాక్షాత్తూ క‌మీష‌న‌రే ఎవ‌రికీ ఎటువంటి స‌మాచారం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఎవ‌రైనా అప్పీల్‌కు వెళ్లినా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతూ ప‌లు స‌మాచార‌హ‌క్కు ప‌త్రాల‌ను తిప్పిపంప‌డ‌మో లేక అక్క‌డే ఉంచుకోవ‌డ‌మో చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రిపించాల్సిన అవ‌స‌రం ఉంది. అదే విధంగా ఎటువంటి అర్హ‌త లేక‌పోయినా ఫ్రీలాన్స‌ర్ కింద ప‌దుల సంఖ్య‌లో అక్రిడిటేష‌న్లు ఇచ్చార‌ని, దీనిపై కూడా విచార‌ణ చేయించి దోషుల‌ను ప‌ట్టుకోవాల్సి ఉంది. సీసీ టీవీల‌కు ఇచ్చిన యాడ్‌ల‌పై కూడా విచార‌ణ చేయించాలి. Electronic విభాగంలో  ఉన్న అవినీతి తిమింగ‌లాన్ని ప‌ట్టుకోవాల‌ని, ఆ డిపార్ట్‌మెంట్‌కు హెడ్‌గా ఉన్న అధికారిని నామ‌మాత్రం చేసి, అంతా తానై అవినీతికి పాల్ప‌డిన స‌ద‌రు అధికారిపై కూడా నూత‌న ప్ర‌భుత్వం,మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి చ‌ర్య‌లు తీసుకోవాలి. గ‌త ఐదేళ్ల కాలంలో జ‌రిగిన అవినీతిపై మంత్రి ఏసీబీ విచార‌ణ చేయించాల‌ని ప‌లువురు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు కోరుతున్నారు. ఈరోజు స‌మాచార‌శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మంత్రి కొలుసు పార్ధ‌సార‌ధి ఈ విష‌యంపై స‌మ‌గ్ర‌విచార‌ణ చేయించి దొంగ‌ల‌ను ప‌ట్టుకుంటార‌నే విశ్వాసాన్ని వారు వ్య‌క్తం చేస్తున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ