లేటెస్ట్

మెగా డిఎస్సీలో రీసోర్స్ టీచ‌ర్స్‌ భ‌ర్తీ లేదా...?

రాష్ట్రంలో కొలువుతీరిన ఎన్‌డిఏ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ప్ర‌క‌టించిన విధంగానే మెగా డిఎస్సీని విడుద‌ల చేసింది. నారా చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే ఆయ‌న త‌న తొలి సంత‌కాన్ని డిఎస్సీ ఫైలుపై పెట్టారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో హ‌ర్షం వ్య‌క్తం అయింది. ఈ మెగా డిఎస్సీ ద్వారా దాదాపు 16,347 టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. గ‌త ఐదేళ్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఒక్క ఉపాధ్య‌పోస్టును భ‌ర్తీ చేయ‌లేద‌ని టిడిపి ఆరోపించింది. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను అధికారంలోకి వ‌స్తే ఏటా మెగా డిఎస్సీ ఇస్తాన‌ని అప్ప‌ట్లో జ‌గ‌న్ నిరుద్యోగుల‌ను న‌మ్మించారు. అయితే..ఆయ‌న ఇచ్చిన హామీని ఆయ‌న నెర‌వేర్చ‌లేదు. దాన్ని చంద్ర‌బాబు బృందం ఎన్నిక‌ల అంశంగా మార్చింది. తాము ఎన్నిక‌ల్లో గెలిస్తే తొలి సంత‌కం మెగా డిఎస్సీపై పెడ‌తామ‌ని హామీ ఇచ్చి ఆ హామీని నెర‌వేర్చింది. అయితే..ఈ హామీ అమ‌లుపై ఒక వైపు నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌గా, వైకాపా నాయ‌కులు మాత్రం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. టిడిపి 52వేల ఉద్యోగ‌పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని ఎన్నిక‌ల్లో ప్ర‌చారంచేసింద‌ని, కానీ ఇప్పుడు కేవ‌లం 16వేలు ఉద్యోగాలు భ‌ర్తీకిమాత్ర‌మే సంత‌కం చేశార‌ని, ఇది నిరుద్యోగుల‌ను మోసం చేయ‌డ‌మేన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టింది. ఆ పార్టీ సోష‌ల్‌మీడియాలో దీనిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. చంద్ర‌బాబు మ‌రోసారి మోసం చేశార‌ని, ఆయ‌న తీరే అంత అంటూ తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తుతోంది. అయితే చాలా కాలం త‌రువాత వ‌చ్చిన మెగా డిఎస్సీపై నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల చంద్ర‌బాబు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేస్తున్నారు. 

సుప్రీం ఉత్త‌ర్వులను అమ‌లు చేయాలి

ఇది ఇలా ఉంటే..డిఎస్సీలో స్పెష‌ల్ కేట‌గిరీ ఉపాధ్యాయుల‌ భ‌ర్తీని ప్ర‌భుత్వం చేప‌ట్ట‌లేద‌ని కొందరు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువ‌స్తున్నారు. వీరు ప్ర‌త్యేక అవ‌స‌రాలు ఉన్న విద్యార్ధులకు బోధిస్తారు. విక‌లాంగులు, మాన‌సిక విక‌లాంగులు, ఇత‌ర అవ‌స‌రాలు ఉన్న విద్యార్దుల కోసం ప్ర‌భుత్వం వీరిని నియ‌మిస్తుంది. రాష్ట్ర ప్ర‌భుత్వం  డిఎస్సీ ప్ర‌క‌టించిన ప్ర‌తిసారి స్పెష‌ల్ కేట‌గిరీ ఉపాధ్యాయుల‌ను భ‌ర్తీ చేస్తుంది. కానీ ఈసారి అటువంటి ప్ర‌క‌ట‌న లేద‌ని వారు చెబుతున్నారు. గ‌త ఏడాది జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు 6వేల పోస్టుల‌తో డిఎస్సీని ప్ర‌క‌టించారు. అయితే అప్ప‌టి ప్ర‌క‌ట‌న‌లో వీరి ప్ర‌స్తావ‌నే లేదు. గ‌తంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు  స్పెష‌ల్ కేట‌గిరీ ఉపాధ్యాయుల పోస్టుల‌ను భ‌ర్తీ చేసేవారు. కానీ ఈసారి ప్ర‌క‌టించిన జాబితాలో వీరి ప్ర‌స్తావ‌న లేదు. ప్ర‌త్యేక అవ‌స‌రాలు ఉన్న విద్యార్ధుల కొర‌కు ప్ర‌తి మండ‌లానికి ఒక ప్ర‌త్యేక ఉపాధ్యాయుడిని న‌య‌మించాల‌ని సుప్రీంకోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది. సుప్రీం ఉత్త‌ర్వుల ప్ర‌కారం డిఎస్సీలో వీరిని నియ‌మించాల్సి ఉంది.  ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి ఈ విష‌యం వెళ్ల‌లేద‌ని, హ‌డావుడిగా ప్ర‌క‌టించ‌డంతో ఇలా జ‌రిగింద‌ని, దీనిపై మ‌రోసారి ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయాల‌ని ప‌లువురు కోరుతున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ