లేటెస్ట్

I&R నుంచే I-Pacకు చెల్లింపులు చేశారా...!?

మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాలు, అరాచ‌కాలు, అవినీతి ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికారం చేతిలో ఉండ‌డంతో ఎన్ని అక్ర‌మాలు, అవినీతి చేసినా అది బ‌య‌ట‌కు రాలేదు. ఒక వేళ బ‌య‌ట‌కు వ‌చ్చినా..త‌న‌కున్న మీడియాబ‌లం, అధికార మంద‌తో..దాని గురించి మాట్లాడిన వారిపై కాల‌కేయ సైన్యంలా విరుచుకుప‌డేవారు. ఇప్పుడా అవ‌కాశం వారికి లేదు. ప్ర‌జ‌లు ఇచ్చిన చారిత్రాత్మ‌క‌తీర్పుతో..వారి అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట‌ప‌డింది. ఐదేళ్ల అవినీతి, దౌర్జన్యాలు, అక్ర‌మాల పుట్ట ప‌గులుతోంది. రోజుకో అక్ర‌మం బ‌య‌ట‌కు వ‌స్తోంది. తాజాగా..ఐదేళ్ల‌పాటు వైకాపాకు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేసిన ఐ-ప్యాక్‌కు చేసిన చెల్లింపుల వ్య‌వ‌హారం, దాని కోసం స‌మాచార‌శాఖ‌ను ఎలా వాడుకుందో...సాక్ష్యాధారాల‌తో, బ‌ట్ట‌బ‌య‌లవుతోంది. ఐదేళ్ల కాలంలో ఐ-ప్యాక్‌కు క‌నీసం రూ.300కోట్లు చెల్లించార‌ని, ఇదంతా ఐ అండ్ పిఆర్‌నే ప‌రోక్షంగా చెల్లించింద‌నే వార్త గుప్పుమంది. ఐ-ప్యాక్‌కు నేరుగా సొమ్ములు చెల్లించ‌కుండా, వేరే పేర్ల మీద ప‌నులు ఇచ్చి వాటిని ఐ-ప్యాక్ కు చెల్లించార‌ని తెలుస్తోంది. ఐ-ప్యాక్‌కు ఐ అండ్ పిఆర్ నిధుల‌ను ఎలా మ‌ళ్లించార‌నే దానిపై నూత‌న ప్ర‌భుత్వం విచార‌ణ చేయిస్తోంది. అదే విధంగా యాడ్ డిజైన్‌పేరుతో ఆయా సంస్థ‌ల‌కు ఎన్నికోట్లు దోచిపెట్టార‌నే దానిపై కూడా విచార‌ణ జ‌రుగుతోంది. దీనిలో ఎవ‌రెవ‌రు భాగ‌స్వాములో తేల్వ‌బోతున్నారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో అవుడ్‌డోర్ యాడ్ ఏజెన్సీలో రింగ్‌మాస్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని, దానిలో ఐ&పిఆర్ మొత్తం త‌న‌దేన‌ని భావించే వ్య‌క్తి కూడా భాగ‌స్వామ్యం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి అవుట్‌డోర్ యాడ్ ఏజెన్సీలో ఈ రింగ్‌మాస్ట‌ర్‌కు నాలుగు ఏజెన్సీలు ఉన్నాయ‌ని, అవ‌న్నీ పేప‌ర్‌పై మాత్ర‌మే ఉంటాయ‌ని, ప‌ని మాత్రం చేసేది ఉండ‌ద‌ని, ఈ సంస్థ‌కు చెందిన ప‌లు ఏజెన్సీల పేరుతో వ‌ర్క్ ఆర్డ‌ర్లు ఇస్తార‌ని, అయితే ఆ సొమ్ముల‌న్నీ తిరిగి ఐ&పిఆర్‌కు చెందిన కీల‌క అధికారుల చేతికి వెళ్లాయ‌ని తెలుస్తోంది. రింగ్ మాస్ట‌ర్‌కు వ‌ర్క్ ఆర్డ‌ర్‌లో ఇచ్చిన మొత్తం ఎమౌంట్‌లో కేవ‌లం 10శాతం మాత్ర‌మే ఇస్తార‌ని, మిగ‌తా సొమ్మంతా స‌ద‌రు కీల‌క అధికారులు మింగేశార‌ని, ఇదంతా ఐ&పిఆర్‌లో అంద‌రికీ తెలిసే జ‌రుగుతుంద‌ని శాఖ‌కు చెందిన కొంద‌రు అధికారులు అన‌ధికారికంగా చెబుతున్నారు. రింగ్ మాస్ట‌ర్ ఏయే యాడ్ ఏజెన్సీల‌కు ఎంతెంత ఇవ్వాలో ముందుగానే నిర్ణ‌యిస్తార‌ని, త‌రువాత ఆయ‌నకు చెందిన నాలుగు సంస్థ‌లు వ‌చ్చిన సొమ్ముల‌ను కీల‌క అధికారుల‌కు పంచుతారు. త‌న సంస్థ పేరిట వ‌చ్చిన వ‌ర్క్ ఆర్డ‌ర్లుసొమ్మును కీల‌క అధికారుల‌కు పంచితే లాభ‌మేమిట‌నే ప్ర‌శ్న రావ‌చ్చు. ఆయ‌న ఎటువంటి ప‌నిచేయ‌కుండానే స‌ద‌రు బిల్లులు ఆయ‌న ఖాతాలోకి చేరిపోతాయి. దీంతో ఎంత వ‌చ్చినా ఆయ‌న‌కు లాభ‌మే. 

ఇది ఇలా ఉంటే..ఐ&పిఆర్ నుంచి కొన్ని వంద‌ల మంది సాక్షి ఉద్యోగుల‌ను, వైకాపా సానుభూతిప‌రుల‌ను వివిధ‌శాఖ‌ల్లో అప్ప‌టి ప్ర‌భుత్వం నియ‌మించింది. అప్ప‌టి ముఖ్య‌మంత్రి సొంత సంస్థ‌కు చెందిన ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలోకి తీసుకోవ‌డ‌మే దారుణ‌మ‌నుకుంటే..వారికి ఇచ్చిన జీతాలు మ‌రీ దారుణం. త‌న‌కు న‌చ్చిన వారికి ఒక్కొక్క‌రికి అక్ష‌రాలా ల‌క్ష రూపాయ‌లు చెల్లించారు. కొంద‌రికీ అంత‌కంటే ఎక్కువే చెల్లించారు. అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు త‌మ జీతాలు రెండువేలు పెంచ‌మంటే..స‌సేమిరా..అని..వారిని నానా అగ‌చాట్లుకు గురిచేసి, చివ‌ర‌కు జైలుకు పంపుతామ‌ని బెదిరించి లొంగ‌తీసిన వైకాపా పెద్ద‌లు..త‌మ సంస్థ‌లో ప‌నిచేసేవారికి నిబంధ‌న‌లు తోసిరాజ‌ని, ల‌క్ష‌ల రూపాయ‌లు క‌ట్ట‌బెట్టారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఐ&పిఆర్ క‌మీష‌న‌ర్‌, ఇత‌ర సీనియ‌ర్ ఉద్యోగుల భాగ‌స్వామ్యం ఉంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌త ఐదేళ్ల నుంచి ఐ&పిఆర్‌లో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాలు, నిధుల దుర్వినియోగం, నిధుల మ‌ళ్లింపుపై సీబీసీఐడి విచార‌ణ కానీ, స్వ‌తంత్ర సంస్థ‌తో కానీ విచార‌ణ జ‌రిపించి దోషుల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు కోరుతున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ