పోలీసుల తీరుమారదా...!?
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా...కొందరు పోలీసు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. వారిలో ఇంకా గత ప్రభుత్వ వాసనలు పోలేదు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన పౌరులను దూషించడం,ఇష్టారాజ్యంగా తిట్టడం, కొట్టడం వారికి పరిపాటి అయింది. ఎటువంటి రాజకీయ,పలుకుబడిలేని, ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ ప్రాంగణానికి వెళ్లాలంటే జంకుతున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి వెళితే వారి చేతిలో ఎన్ని అవమానాలు పాలుకావాల్సి వస్తుందోనన్న శంకతో బిక్కుబిక్కుమంటున్నారు. అన్యాయానికి, అక్రమానికో గురైన వ్యక్తి పోలీస్ స్టేషన్ గడప తొక్కాలంటే వణికిపోతున్నారు. ఒకవైపు తన జరిగిన అన్యాయంతో భీతిల్లుతుంటే..మరోవైపు పోలీసులు అనేమాటలకు బిక్కచచ్చిపోతున్నారు. దీంతో కొందరు తమకు ఎంత అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కడానికే ఇష్టపడడంలేదు. తమకు జరిగిన అన్యాయానికి లోనలోన కుల్లిపోతున్నారు. గత ప్రభుత్వహయాంలో ఎంత అన్యాయం జరిగినా అప్పటి కీచక ప్రభుత్వం పట్టించుకోదనే భావనతో సామాన్యులు మౌనాన్నే ఆశ్రయించారు. అయితే ఇటువంటి పరిస్థితులు మారాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రికావాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రజలందరూ ఒకేతాటిపైకి వచ్చి ఆయనను గెలిపించుకున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిందని, పోయిన స్వేచ్ఛవచ్చిందని భావించారు. అయితే..గతం తాలుకా చెత్తంతా వివిధ రూపాల్లో తిష్టేసుకోవడంతో..సామాన్యులకు మళ్లీ అవమానాలు పాలవుతున్నారు. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్లలకు వెళితే సామాన్యులకు అవమానాలే గతి. గతంలో జరిగిందే..ఇప్పుడూ జరుగుతోంది. పోలీస్ వ్యవస్థలో మార్పుతీసుకువస్తానని, పోలీసుల్లో మార్పులు తెస్తామని నూతనంగా రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత ఇటీవల చెప్పారు. పోలీసుల్లో మార్పు రాకపోతే వారిని మార్చివేస్తానని ప్రకటించారు. బాధ్యతగా వ్యవహరించాలని, సామాన్యులను ఇబ్బందులు పెట్టవద్దని,అసాంఘికశక్తులను, అక్రమార్కులను అణిచివేయాలని, మహిళలు, బాలికలపై దాడులు చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని ఆమె పోలీసులకు ఆదేశాలిచ్చారు. అయితే..ఆమె ఆదేశాలను పోలీసులు ఎక్కడా పాటించడంలేదు. గత పాలకుల సమయంలో ఎలా వ్యవహరించారో..అదేరీతిన ఇష్టారాజ్యంగా కొందరు వ్యవహరిస్తున్నారు. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.