ఐటీ ఉద్యోగుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ హైదారబాద్ నుంచి ఐటి ఉద్యోగులు చేపట్టిన ర్యాలీని ఆంధ్రాపోలీసులు కృష్ణా జిల్లా వద్ద అడ్డుకుంటున్నారు. వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఆదివారం నాడు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కార్ల ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల నిరసనలు అడ్డుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున్న పోలీసులను మొహరించింది. హైదరాబాద్ నుంచి వస్తోన్న వేలాది వాహనాలను పోలీసులు బోర్డర్‌లో ఆపేస్తున్నారు. దీనిపై ఐటీ ఉద్యోగులు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా చేస్తోన్న ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారని, ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. భారతదేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళే తమను ఆంధ్రప్రదేశ్‌కు రాకుండా అడ్డుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ దేశంలో భాగం కాదా..అని వారు ప్రశ్నిస్తున్నారు. సంఘీభావంగా ర్యాలీ చేస్తోన్న ఐటీ ఉద్యోగులను అడ్డుకోవడం అప్రజాస్వామికమని నిర్మాత అట్లూరి నారాయణరావు విమర్శించారు. పోలీసుల చర్యల పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. రాజకీయ కక్షలతోనే చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అరెస్టు చేసిందని, అరెస్టులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన, కేంద్రప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. కాగా భారీ ఎత్తున వస్తోన్న ఐటీ ఉద్యోగులను అడ్డుకోవడానికి పోలీసులు రాజమండ్రి వద్ద, ఇతర ప్రాంతాల్లో పోలీసులను భారీగా మొహరించారు.