సబిత X రేవంత్ రెడ్డి...!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల సభలో పైచేయి సాధించేందుకు హోరాహోరిగా పోరాడుతున్నారు. ఆంధ్రా అసెంబ్లీతో పోల్చుకుంటే..తెలంగాణ అసెంబ్లీని చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తోన్నారు. ఆంధ్రాలో ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీకీ రాకపోవడం, ప్రధాన ప్రతిపక్షనేత లేకపోవడం తదితరాలతో అంతా ప్రభుత్వమే తప్ప ప్రతిపక్షం కానరావడం లేదు. దీనితో పోల్చితే..తెలంగాణ అసెంబ్లీ చర్చలను ఎక్కువ మంది వీక్షిస్తున్నారు. అక్కడ ప్రజా సమస్యల సంగతి ఏమో కానీ, వ్యక్తిగత అంశాలు ప్రజల్లో ఆసక్తిని కల్గిస్తున్నాయి. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిని ఉద్దేశించి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో కలకలం సృష్టించాయి. వెనుక కూర్చున్న అక్కను నమ్మవద్దని కెటిఆర్‌ను ఉద్దేశించి, రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సబితాఇంద్రారెడ్డి చిన్నబుచ్చుకున్నారు. కంటతడి పెట్టారు. మహిళను అవమానించారని, మహిళలపై ఇదేనా గౌవరం అంటూ ఆమె ప్రశ్నించారు. తాను చేసిన తప్పేమిటో చెప్పాలని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారో..తెలుసు కదా..తాను పార్టీ మారితే..తప్పేమిటో చెప్పాలన్నారు. అయితే..తనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది..సబితేనని, అయితే..తాను మల్కాజ్‌గిరి ఎంపిగా పోటీ చేస్తున్నానని చెబితే..ఆమె ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ను వీడి బిఆర్ ఎస్‌లో చేరారని, ఇంతకంటే మోసం ఏముంటుందని రేవంత్ సభ సాక్షిగా సబితాఇంద్రారెడ్డిని నిలదీశారు. దీంతో..సబిత కన్నీళ్లు పెట్టుకుంటూ చేసిన ప్రసంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలను అవమానించారని, ఆయన క్షమాపణ చెప్పాలంటూ ప్రతిపక్ష బిఆర్ ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపిచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సబిత, రేవంత్‌రెడ్డిల ప్రసంగాలపై ప్రజల్లో చర్చకు కారణమైంది.
ఇద్దరూ టిడిపి నుంచి వచ్చిన వారే...!
కాగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా నిలిచిన సబితాఇంద్రారెడ్డి, రేవంత్‌రెడ్డిలు ఇద్దరూ తెలుగుదేశం పార్టీ మూలాలు కలిగిన వారే. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి భర్త ఇంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలకనేత. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ మరణించిన తరువాత కాంగ్రెస్‌లో చేరారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన తరువాత సబితాఇంద్రారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత ఆమె టిడిపిలో చేరాలని భావించినా..కొన్ని కారణాలవల్ల ఆమె కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు తొలుత ఈమె నియోజకవర్గమైన చేవెళ్ల నుంచే ప్రారంభించారు. అప్పట్లో ఇదో సంచలనం. కాంగ్రెస్ గెలిచిన తరువాత ఆమెను రాజశేఖర్‌రెడ్డి హోంమంత్రిగా నియమించారు. వై.ఎస్ మరణం తరువాత కూడా ఆమె ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు. అయితే..2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో..ఆమె బిఆర్ ఎస్‌లో చేరి మంత్రి పదవిని చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బిఆర్ ఎస్ ఓడిపోవడంతో..ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆమె తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఉంది. ఆమె కాంగ్రెస్‌లో చేరలేదనే కక్షతోనే..ఇప్పుడు రేవంత్‌రెడ్డిపై ఆమెపై కక్ష సాధిస్తున్నారని బిఆర్ ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా టిడిపి నుంచి వచ్చిన వారే. టిడిపిలో రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణలో టిడిపి బలహీనం కావడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి..మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో.. ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తం మీద..ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయమైన ఈ ఇద్దరు నాయకులూ టిడిపి మూలాలు ఉన్నవారు కావడం గమనార్హం.