‘జోగి’ పాపం పండింది...!?
మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు ఆయన తనయుడు జోగి రాజీవ్ నిందితులుగా ఉన్నారు. ఈ రోజు జోగి నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం జోగి తనయుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఇష్టానుసారం వ్యవహరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై అప్పట్లో రమేష్ దాడి చేశారు. వందల కొద్ది అనుచురులను వేసుకుని అప్పటి ప్రతిపక్షనేత ఇంటిపై దాడికి వెళ్లారు. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి వెళ్లడం ఏమిటని, రాష్ట్రంలో నెలకొన్న అరాచకపరిస్థితులకు ఇది రుజువని అప్పట్లో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అయితే..రమేష్ దాడిని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి సమర్ధించడమే కాకుండా ఆయనకు ప్రమోషన్ ఇచ్చి మంత్రిని చేశారు. మంత్రి అయ్యాక జోగి మరింత రెచ్చిపోయారు. అటు ప్రతిపక్షానికి చెందిన వారినే కాకుండా స్వంతపార్టీ వారిని కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టారు. అప్పట్లో జగన్‌కు ఎదురుతిరిగిన వైకాపా ఎంపి రఘురామకృష్ణంరాజును జోగి పచ్చిబూతులు తిట్టారు. అప్పటి ముఖ్యమంత్రి సభలోనే ఆయన పచ్చిబూతులు తిట్టారు. మంత్రి హోదాలో జోగి బూతులు తిడుతుంటే..వారించాల్సిన జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ప్రోత్సహించారు. అప్పట్లో రేపనేదే లేకుండా జోగి వ్యవహరించారు. అధికారం శాశ్వితం అన్నట్లు ఆయన ఆయన కుమారుడు కృష్ణాజిల్లాలో విధ్వంసం సృష్టించారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..! అప్పట్లో చేసిన పాపాలను ఇప్పటి కూటమి ప్రభుత్వం లెక్కగడుతోంది. జోగి, ఆయన కుమారుడు చేసిన అవినీతి భాగోతాలను బయటకు తీసి, కటకటాల వెనుక్కు నెట్టడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా అగ్రిగోల్డ్‌లో తండ్రీకొడుకులు చేసిన అవినీతిపై చర్యలు మొదలుపెట్టింది. ఈ మొత్తం అవినీతి వ్యవహారంలో ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో తండ్రీకొడుకులిద్దరితో కూటమి ప్రభుత్వం ఊచలు లెక్కించబోతోంది. చేసిన పాపాలు అంత తేలిగ్గామాసిపోవు...!