జగన్ గాలి తీసిన షర్మిల..!
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మబోయి చివరకు ఆయనే ఇరుక్కుంటున్నారు. లేనిపోని ఆరోపణలు, అసత్యాలు, అర్థసత్యాలను చెబుతోన్న ఆయన మాటలను చివరకు ఆయన స్వంత చెల్లే నమ్మడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 32 మంది వైకాపా కార్యకర్తలను హత్య చేశారని ఢిల్లీలో ధర్నా చేసిన జగన్..ఎవరెవరు హత్యకు గురయ్యారో..వారి వివరాలు ఇవ్వమంటే..పారిపోయిన వైనం మర్చిపోకముందే..గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వివాదంలో మరోసారి పూల్ అయ్యాడు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల బాత్‌రూమ్‌లో కెమెరాలు ఉన్నాయని జగన్ మీడియా, ఆయన సోషల్‌మీడియా కోడైకూసి రాష్ట్రంలో అల్లకల్లోలం రేపింది. దాదాపు 300 వీడియోలు ఉన్నాయని ఒకటే ఊదరగొట్టింది. దీంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈ విషయం చర్చనీయాంశం అయింది. విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థినులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు, ప్రభుత్వం మాత్రం వీడియోలు ఏమీ లేవని, అంతా అబూతకల్పన అని చెప్పినా జగన్ మీడియా హంగామా ఆగలేదు. సోషల్‌మీడియాలోనూ హోరెత్తించారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతున్నా..దానిని పట్టించుకోకుండా కాకిగోల చేసింది. అయితే..ఈరోజు జగన్ చెల్లెలు గుడ్లవల్లేరు కాలేజీలో ఏమీ జరగలేదని, అసలు వీడియోలే లేవని స్పష్టం చేసింది. తమ పార్టీ బృందం అక్కడకు వెళ్లిందని, అక్కడేమీ లేవని, అంతా అబూతకల్పనలేనని, లేనిదానిపై వివాదం చేస్తున్నారని ఆమె అన్నారు. దీంతో..జగన్ బృందం చేసిన హడావుడి షర్మిల ప్రకటనతో గాలితీసినట్లైంది. పెయిడ్ బృందాలను పెట్టుకుని, ఏదోరకంగా కల్లోలం సృష్టించాలన్న జగన్ బృందం పాచికలు గుడ్లవల్లేరులో పారలేదు. అయితే..ఈ బృందం ఇంకో అంశాన్ని ఎంచుకుని మరోసారి కలకలం సృష్టించేందకు ఎత్తుగడలు వేస్తూనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోతే..తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది.