ఎవరు జర్నలిస్టులు...!?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధర్మసందేహం వచ్చింది. ఇప్పుడున్న మీడియాలో ఎవరు జర్నలిస్టులో తెలియడం లేదని, ప్రతి ఒక్కరూ..ఒక గొట్టం తెచ్చి..అసలైన జర్నలిస్టుల కంటే ముందు వరుసలో కూర్చుంటున్నారని, అసలు కంటే కొసరు ఎక్కువైందని, యూట్యూబ్ జర్నలిస్టుల పేరుతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆయన యూట్యూబ్ జర్నలిస్టులపై విరుచుకుపడ్డారు. జర్నలిస్టులు అనే పదానికి అర్థాన్ని మీడియా సంఘాలు నిర్వచించాలని, ప్రభుత్వం ఎవరిని జర్నలిస్టులుగా పరిగణించాలో తెలియడం లేదని, ఎవరు బడితేవాడు వచ్చి యూట్యూబ్ అనే ట్యాగ్ తగిలించుకుని వస్తున్నారని, వచ్చిన వాళ్లు కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, ఏదైనా అంటే జర్నలిస్టులపై దాడి అంటూ యాగి చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. ఎవరిని జర్నలిస్టులుగా పరిగణించాలి...? ఎవరెవరినీ సచివాలయంలోకి, అసెంబ్లీలోకి రానీయాలనేదానిపై మీడియా సంఘాలు తేల్చాలని ఆయన అన్నారు. సచివాలయలంలో మీడియా పేరుతో వచ్చి మంత్రుల వద్ద పైరవీలు చేస్తున్నారని, అదేవిధంగా అడ్డగోలుగా ఒక పార్టీకి అనుబంధంగా మారి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీలకు అనుబంధంగా ఉంటూ, మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రిని కూడా గౌవరించడం లేదని, ముఖ్యమంత్రిని ఎన్నుకున్నది ప్రజలని, అది కూడా చూడకుండా ఇష్టారీతి భాషతో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీనిపై ఏమి చేయాలో సంబంధిత మంత్రితో చర్చిస్తామని ఆయన చెప్పారు. కాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసిన తరువాత ఆయన సోషల్‌మీడియాలో యూట్యూబ్ పేరుతో రచ్చరచ్చ చేస్తోన్న కొన్ని యూట్యూబ్‌లను కట్టడిచేసే చర్యలు తీసుకోబోతున్నారని అర్థం అవుతోంది. వాస్తవానికి తెలంగాణలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా, ఆయనను ఏకవచనంతో..సంబోధిస్తున్నాయి. గుంపుమేస్త్రీ అంటూ..ఆయనపై ధ్వజమెత్తుతున్నాయి. ఇలా ధ్వజమెత్తే ఛానెల్స్‌కు బీఆర్ ఎస్ మద్దతు ఇస్తోంది. వారి మద్దతుతో కొంతమంది యూట్యూబ్ వాళ్లు హద్దూ,అదుపూ లేకుండా రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత దాడి చేస్తున్నారు. దీంతో..సోషల్‌మీడియాను కట్టడి చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి చాలా యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని వెబ్‌సైట్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వీటిలో కొన్ని పైయిడ్ యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఎన్నికల సమయంలోనూ, తరువాత కూడా ప్యాకేజీలు కుదుర్చుకుని ఒక పార్టీని నెత్తిన పెట్టుకుని మోస్తున్నాయి. తెలంగాణాలోనూ, ఆంధ్రాలోనూ ఇదే దందా నడుస్తోంది. మరోవైపు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉదయాన్నే వార్తల విశ్లేషణ అంటూ..తమకు ఇష్టం లేనివారిని, పచ్చిబూతులతో, అభ్యంతరకర భాషతో దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇలా వ్యవహరించేవారంతా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు. వీరందరిని కట్టడి చేయడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన వ్యాఖ్యలును చూస్తే అర్థం అవుతోంది.