టోల్ ఛార్జీలు తప్పవు: మంత్రి జనార్ధన్‌రెడ్డి
రాష్ట్రంలో త్వరలో పిపిపి విధానంలో రోడ్లు నిర్మిస్తామని, ఈ రోడ్లపై టోల్ ఛార్జీలు వసూలు చేస్తామని రాష్ట్ర రోడ్లు & భవనాలశాఖ మంత్రి బి.సి. జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పిపిపి విధానంలో రోడ్లను నిర్మించబోతోందని, ఈ విధానాన్ని అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం గుజరాత్ వెళుతుందని ఆయన చెప్పారు. పిపిపి విధానం గుజరాత్, అస్సామ్ రాష్ట్రాల్లో విజయవంతం అయిందని,అదే విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికే టోల్ ఛార్జీలపై ప్రజల నుండి వ్యతిరేకత వస్తోంది కదా..మళ్లీ టోల్ పెడితే..కష్టం కదా..అని విలేకరులు ప్రశ్నించగా నాణ్యమైన రోడ్లు కావాలంటే ఛార్జీలు తప్పవని ఆయన అన్నారు. అయితే..ఈ టోల్ నుంచి బైక్‌లకు, ఆటోలకు, ట్రాక్టర్స్‌కు మినహాయింపు ఇస్తామని మంత్రిచెప్పారు. రాష్ట్రంలో 384 కి.మీ. మేర ఏడు జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.6585కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడారని, దీని వల్లే నిధులు వచ్చాయని ఆయన చెప్పారు.
గుంతల పూడికకు రూ.290 కోట్లు మంజూరు
గత ప్రభుత్వం రహదారుల నిర్వహణపై అశ్రద్ధ చూపడం వల్ల రాష్ట్రంలో రహదారులు అద్వాన్నంగా మారాయని, ఇప్పుడు వాటిని బాగు చేయాలంటే అధిక మొత్తంలో నిధులు కావాల్సి ఉందని, అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు గుంతలను పూడ్చడానికి రూ.290కోట్లుమంజూరు చేశారని, ప్రస్తుతం వర్షాలు తగ్గిన తరువాత గుంతలను పూడుస్తామని మంత్రి చెప్పారు.
NHO క్రింద రాష్ట్రానికి ఏడు ప్రాజెక్టులు...!
నేషనల్ హైవేస్ అర్డనరీ ప్రొగ్రామ్ (NHO) క్రింద రాష్ట్రానికి మంజూరు చేసిన ఆ ఏడు ప్రాజెక్టుల కేంద్రం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.
1)కొండమూడు నుంచి పేరిచర్ల వరకు 49.9 కి.మీ మేర జాతీయ రహదారి
2)సంగమేశ్వరం నుంచి నల్లకాలువ మరియు వెలుగోడు నంద్యాల జిల్లా వరకు 62.5 కి.మీ జాతీయ రహదారి
3)నంద్యాల నుంచి కర్నూలు/ కడప బోర్డర్ సెక్షన్ వరకు 62 కి.మీ జాతీయ రహదారి
4)వేంపల్లి నుంచి చాగలమర్రి సెక్షన్ వరకు 78.95 కి.మీ జాతీయ రహదారి
5)గోరంట్ల నుంచి హిందుపూర్ సెక్షన్ వరకు 33.58 కి.మీ జాతీయ రహదారి
6)ముద్దనూరు నుంచి బి. కొత్తపల్లి సెక్షన్ వరకు 56.5 కి.మీ జాతీయ రహదారి
7)పెందుర్తి నుంచి బవ్దరా సెక్షన్ వరకు 40.55 కి.మీ. జాతీయ రహదారి.