టిడిపి ఆర్థిక మంత్రులు...!
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆర్థిక మంత్రిత్వశాఖకు ప్రత్యేక అనుభవం ఉన్న వ్యక్తులకే ఆ శాఖను అప్పగిస్తుంది. ఎన్టీఆర్ కాలంలో ఎలా ఉన్నా...చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ఆశాఖకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి అధికారమార్పిడి జరిగిన తరువాత చంద్రబాబు నాయుడు ఆర్ధికశాఖను నిజాయితీపరుడైన అశోక్‌గజపతిరాజుకు అప్పగించారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయితే..చంద్రబాబు, అశోక్‌లు కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చారు. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చిన్నప్పుడు ఆ శాఖను యనమల రామకృష్ణుడుకు కేటాయించారు. ఆర్థిక మంత్రిగా యనమల బాగానే పనిచేశారు. ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన ఆర్థికశాఖను విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర విభజన తరువాత మళ్లీ ఆయనే రాష్ట్ర ఆర్థిక మంత్రి అయ్యారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా..ఆయనను ఎమ్మెల్సీగా చేసి చంద్రబాబు ఆయనకు ఆర్థికశాఖను అప్పగించారు. ఆర్థిక మంత్రిగా మరోసారి యనమల అద్భుతంగా శాఖను నిర్వహించారు. అప్పట్లోఆయన ఆర్థికశాఖకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీడియాకు వివరించేవారు. మీడియాతో అవసరమున్న ప్రతిసారి సమావేశమయ్యేవారు. ఆయన అనుభవంతో విభజన వల్ల నష్టపోయినా..ఆ నష్టం తెలియకుండానే ఆర్థిక వ్యవహారాలను నిర్వహించారు. అయితే..ఇప్పుడు ఆయన వారసుడిగా ఆర్థిక మంత్రి అయన పయ్యావుల కేశవ్ ఆర్థిక వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. ఆయన మంత్రి అయిన తరువాత పులివెందులకు చెందిన జగన్ కాంట్రాక్టర్లుకు బిల్లులుచెల్లించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అదొక్కటే కాదు..ఆయన మీడియాకు కూడా అందుబాటులో ఉండడం లేదని సచివాలయజర్నలిస్టులు చెప్పుకుంటున్నారు. గతంలో యనమల మీడియాతో బాగా ఉన్నారని, పయ్యాలవుల మాత్రం ఎంపిక చేసిన జర్నలిస్టులతో విషయాలను పంచుకుంటున్నారనే గుసగుసలు సచివాలయంలో వినిపిస్తున్నాయి. టిడిపి మీడియాకు దగ్గరగా ఉంటుందని, కానీ కేశవ్ మాత్రం ఎంపిక చేసిన వారినే తనతో మాట్లాడేందుకు అనుమతి ఇస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద..టిడిపి ఆర్థిక మంత్రుల్లో కేశవ్ తీరు వేరని వారు అంటున్నారు. మూడు నెలల్లోనే ఒక అభిప్రాయానికి రావడం సరికాదు కానీ..టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి అంటే యనమల గుర్తుకు వస్తున్నారని, ఇప్పుడు మాత్రం కేశవ్ ఆర్థికశాఖపై పట్టుకోసం ఇంకా ప్రయత్నాలుచేస్తున్నారు. ఆయన విజయవంతం అవుతారా..? లేక విఫలం అవుతారా..? భవిష్యత్‌లో చూడాలి.