ఆంధ్రాకు..ఆమ్రపాలి...!?సిఆర్‌డిఏ కమీషనర్ గా నియమిస్తారా..?
కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యహారాలశాఖ (DOPT) ఇచ్చిన ఆదేశాలు ఐఏఎస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. కేంద్రం కేటాయించిన విధంగా కాకుండా తెలంగాణ, ఆంధ్రల్లో పనిచేస్తోన్న ఐఏఎస్‌లు వెంటనే తమతమ మాతృరాష్ట్రాలకు వెళ్లాలని ఇచ్చిన ఆదేశాలు కొందరు ఐఏఎస్‌ల్లో తర్జనభర్జనకు కారణమవుతోంది. దీనిపై కోర్టుకు వెళ్లినా ఇప్పుడే తీర్పు రావడం కష్టం కనుక వెంటనే వారికి కేటాయించిన రాష్ట్రానికి వెళ్లిపోవడానికి వారు సిద్ధం అవుతున్నారు. అయితే ఇద్దరు మహిళా ఐఏఎస్‌ల వ్యవహారం తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రుల జోక్యం వరకూ వెళుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తోన్న సృజన, తెలంగాణలో జిహెచ్ఎంసి కమీషనర్‌గా పనిచేస్తోన్న ఆమ్రపాలిలను ఆయా రాష్ట్రాల్లోనే కొనసాగించాలని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖ రాయబోతున్నారు. అయితే..వారి లేఖలపై స్పందన వచ్చే లోగానే..వారు వారికి కేటాయించిన చోటుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే..జిహెచ్ఎంసి కమీషనర్‌గా పనిచేస్తోన్న ఆమ్రపాలి ఆంధ్రాకు వస్తే..ఆమెకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. యువ ఐఏఎస్‌గా ఆమ్రపాలికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆమె ఎక్కడ పనిచేసినా..తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడికి, సిఫార్సులకు లొంగకుండా పనిచేస్తారనే పేరుంది. నిజాయితీపరురాలిగా, సమర్థవంతంగా, చాకచక్యంగా, చురుగ్గా ఉండారని పేరుతెచ్చుకున్న ఆమె ఆంధ్రాకు వస్తే కీలకమైన పోస్టులో పాలకులు నియమిస్తారనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. ఆమె సేవలను కీలకమైన సిఆర్‌డిఏలో వాడుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వారి వద్ద నుంచి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితుల్లో ఆమెను సిఆర్‌డిఏలో నియమిస్తే బాటుంటుదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ సీనియర్ ఐఏఎస్ భాస్కర్ పనిచేస్తున్నారు. భాస్కర్‌కు నిజాయితీపరుడు, సమర్ధుడు, పనిమంతుడనే పేరుంది. అయితే..ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఈ ముక్కుసూటిదనమే ఆయనకు మున్సిపల్ మంత్రి నారాయణ మధ్య విభేదాలకు కారణం. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా ఒక దరికి రాలేదు. ఇప్పటికే భాస్కర్‌ను బదిలీ చేయాలని మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారని, దానికి చంద్రబాబు అంగీకరించలేదంటున్నారు. ఇక వేళ నారాయణ ఒత్తిడి అధికమైతే..భాస్కర్ బదిలీ తప్పదు. ఆయన స్థానంలో సమర్థవంతంగా పనిచేసే ఆమ్రపాలిని నియమిస్తే..బాగుంటుందని, ఆమె అయితే..సమర్ధవంతంగా, వేగంగా పనులు చేస్తారని భావన ఉంది. మొత్తం మీద..ఆమ్రపాలి ఆంధ్రాకు వస్తే..ఆమెకు కీలకమైన పోస్టు లభిస్తుంది.