భారీగా ఐఏఎస్‌ల బదిలీలు...!
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరువాత కూటమి ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయబోతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన కొన్నిశాఖలతోపాటు, సిఎంఓలోని ఓ అధికారిని కూడా బదిలీ చేయబోతోన్నట్లు ప్రచారం సాగుతోంది. కొందరు సీనియర్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనాలకు అందే రీతిలో పనిచేయకపోవడం, అవినీతి ఆరోపణలు రావడం, వైకాపాకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలతో వారిపై బదిలీ వేటు పడబోతోంది. అయితే ఎవరెవరినీ బదిలీ చేయాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కొంత స్పష్టత వచ్చిందంటున్నారు. ఇటీవల కాలంలో సిఎంఓలో వివాదాస్పదమైన అధికారిని బదిలీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈయన సిఎంఓలో పనిచేయడం టిడిపి నాయకులకు, కార్యకర్తలకు నచ్చడం లేదు. ఆయన కూడా వైకాపాకు మద్దతుగా పనిచేస్తున్నారని, వైకాపా వారికే ఆయన వద్ద పనులు అవుతున్నాయని, పైగా ప్రతిదాన్ని వివాదాస్పదం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో..ఈ అధికారిపై బదిలీ వేటుపడుతుందంటున్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మంత్రి తన శాఖకు సంబంధించిన అధికారిని బదిలీ చేయాలని కోరుతున్నారు. ఆ మంత్రికి, ఆ అధికారికి పొసగడం లేదు. తాను చెప్పిందే చేయాలని మంత్రి పట్టుబడుతుండగా, నిజాయితీపరుడైన ఆ అధికారి ఆయన మాట వినడం లేదు. వీరిద్దరి మధ్య ముఖ్యమంత్రి రాజీ చేశారు. ఇద్దరూ తనకు కావాల్సిన వారు కావడంతో..గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య సయోధ్య కోసం యత్నించారు. అయితే..ఆ ఇద్దరి వైఖరిలో మార్పు లేకపోవడంతో..ముఖ్యమంత్రి చివరకు సన్నిహిత మంత్రివైపే మొగ్గుచూపుతున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో..నిజాయితీపరుడైన అధికారిపై బదిలీ వేటు పడుతుందంటున్నారు.
ఇక వీరు కాకుండా కొన్నిశాఖలకు ఇన్‌ఛార్జిలను నియమించారు. ఆ ఇన్‌ఛార్జిలను తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని నియమించ బోతున్నారు. కొందరు ఐఏఎస్ అధికారులు ఇప్పుడు రెండు,మూడుశాఖలను పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా వైకాపాకు చెందిన వారికి బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలపై మరో అధికారినికూడా బదిలీ చేసే అవకాశం ఉంది. టిడిపి నేతలు ఈ ఐఏఎస్‌పై నేరుగా సోషల్‌మీడియాలో ఆరోపణలు చేశారు. వైకాపా అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడని ఆయన మీద టిడిపి నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో..ఈయనపై బదిలీ వేటుపడవచ్చు. కాగా వచ్చే నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీకాలం పూర్తికానుండడంతో.. ఆయన స్థానంలో ఎవరిని సిఎస్‌గా నియమించాలనేదానిపై కూడా కసరత్తు జరుగుతోందని ప్రచారం సాగుతోంది. దీనిపై స్పష్టత వస్తే..మరో నలుగురైదుగురు సీనియర్ అధికారులను కూడా బదిలీ చేస్తారు. మొత్తం మీద...కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తరువాత భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయబోతోంది.