లేటెస్ట్

మోస‌పోయామా...? టిడిపి కార్య‌క‌ర్త‌ల్లో వేద‌న‌...!?

ఓ టిడిపి కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య‌పై పార్టీలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. చిల‌క‌లూరిపేట‌కు చెందిన  ఐటిడిపి కార్య‌క‌ర్త వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనో..లేక ఇత‌ర కార‌ణాల‌తోనో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీనిపై విద్యాశాఖ‌మంత్రి, టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆవేద‌న‌తో ఎక్స్‌లో సుధీర్ఘ‌మైన పోస్టు పెట్టారు. త‌న‌కు ఉన్న బాధ‌లు కానీ, స‌మ‌స్య‌లు కానీ..త‌న‌కు చెబితే..తీర్చేవాడిని క‌దా..అంటూ..ఆయ‌న పెట్టిన పోస్టుపై ఇప్పుడు పార్టీలో చ‌ర్చ సాగుతోంది. ఒక కార్య‌క‌ర్త ప్రాణాలు కోల్పోయిన త‌రువాత‌..లోకేష్ స్పందించిన వైనంపై కొంద‌రు సానుకూలంగా స్పందిస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం..ఎందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్రాణాలు తీసుకుంటారంటూ అసంతృప్తితో పోస్టులు పెడుతున్నారు. టిడిపి ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా..అప్ప‌టి అధికార‌ప‌క్షం త‌న‌ను ఎంత వేధించినా, అసభ్యంగా పోస్టులు పెట్టినా..పోరాటం చేసిన ఉండ‌వ‌ల్లి అనూష అనే కార్య‌క‌ర్త‌..ఎందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్రాణాలు తీసుకుంటారంటూ చేసిన పోస్టు టిడిపి కార్య‌క‌ర్త‌ల వైఖ‌రికి అద్దం ప‌డుతుంది.  ఒక కార్య‌క‌ర్త వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకుంటే..దాన్ని పార్టీ వైఫ‌ల్యానికి కార‌ణంగా చెప్ప‌డం ఇక్క‌డ ఉద్దేశ్యం కాదు. అయితే..పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఎందుకు ఇంత విర‌క్తి, విసుగు, వ‌చ్చాయో..అధినేత‌లు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చినా..ఎందుకు పార్టీ కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రులు సంతృప్తిలో లేరు. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ప్రాణాల‌కు తెగించి ప‌నిచేసి, పార్టీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషిచేసిన వారిలో ఇంత‌లోనే ఎందుకు ఇంత నిర్వేదం..నిరాశ‌, నిరాస‌క్త‌త‌..? ఆరు నెల‌ల్లోనే వారిలో ఎందుకు ఇంత మార్పు వ‌చ్చింది..?దీనంత‌టికీ కార‌ణం ఎవ‌రు..?  వారిని ఆశ‌ల ప‌ల్ల‌కీలో ఊరేగించి..అమాంతం తోసేసిన వారెవ‌రు..? అనే దానిపై పార్టీలో చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి టిడిపి కార్య‌క‌ర్త‌ల పార్టీ. ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ అన్న‌ట్లు పార్టీ అధినేత‌లుగా ఎవ‌రు ఉన్నా..పార్టీ కోసం టిడిపి కార్య‌క‌ర్త‌లు నిస్వార్థంగా ప‌నిచేస్తార‌ని, ఇటువంటి కార్య‌క‌ర్త‌లు ఏ పార్టీకీ లేర‌ని ఆయ‌న అన్నారు. అంతే కాదు..పార్టీ అధినేత త‌ప్పు చేస్తే..నిల‌దీసే పార్టీ కూడా ఇదేన‌ని, గ‌తంలో ఎన్టీఆర్ వల్ల పార్టీకి న‌ష్టం వాటిల్లుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తే..ఆయ‌న వైపే పార్టీ కార్య‌క‌ర్త‌లు వ‌చ్చార‌ని, ఎన్టీఆర్ వంటి నాయ‌కున్నే ఎదిరించిన కార్య‌క‌ర్త‌లు ఉన్న పార్టీ టిడిపి అని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే..అటువంటి కార్య‌క‌ర్త‌లు ఉన్న పార్టీ ఇప్పుడు తీవ్ర‌మైన నిరాశ‌లో మునిగిపోయింది.  


కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకునే నాథుడేడి...!?

జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు కీల‌క‌మైన నాయ‌కులు, ప‌ద‌వులు అనుభ‌వించిన నాయ‌కులు, సొమ్ములు భారీగా సంపాదించుకున్న వారు..రాష్ట్రానికి ఆవ‌ల ఉండి జ‌రుగుతోన్న త‌తంగాన్ని చూశారు..తప్ప ఇక్క‌డ‌కొచ్చి పోరాడిన వారే లేరు. అయితే..వారు రాక‌పోయినా..కార్య‌క‌ర్త‌లు ప్రాణాలు, మానాలు పోతున్నా..ఆస్తులు పోతున్నా..జ‌గ‌న్ అరాచ‌కానికి ఎదురొడ్డిపోరాడారు. వారి పోరాటం, త్యాగాల‌వ‌ల్ల, పార్టీ అధినేత వ్యూహాల‌వ‌ల్ల మ‌ళ్లీ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. అయితే..అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌..పార్టీ కోసం ప‌నిచేసిన కార్య‌క‌ర్త‌ల‌ను ఒంట‌రిగా క‌లిసి..ఎలా ఉన్నార‌ని అడిగిన నాధుడే లేడు. అధినేత‌ను, ఆయ‌న కుమారుడ్ని ఒంట‌రిగా క‌లిసే అవ‌కాశ‌మే లేదు. వాళ్లే మీ ప‌ద‌వులు, ప‌నులు కోరుకోవ‌డం లేదు. అధినేత‌, ఆయ‌న కుమారుడితో ఒక అభినంద‌న‌, ఒక ప్ర‌శంస మాత్ర‌మే కోరుకుంటున్నారు. కానీ..వాళ్లిద్ద‌రూ తీవ్ర‌మైన బిజీ. పార్టీ కోసం ప‌నిచేసిన వారు వారిని క‌ల‌వాలంటే..అంద‌రితో పాటు క్యూలో రావాల్సిందే. అంద‌రి ముందూ వారికి విన్న‌పాలు విన్న‌వించాల్సిందే. వారొక్క‌రే కాదు..సోష‌ల్ మీడియాలో..ఎవ‌రంత‌ట వారు స్వ‌యంగా పోరాడిన వారికి కూడా అపాయింట్‌మెంట్లు లేవు. వారిని గుర్తించేవారే లేరు. వారికి స్వాంత‌న మాట‌లు క‌లిగించే వారే లేరు. క‌నీసం బాగా ప‌నిచేశార‌న్న ఒక్క అభినంద‌న మాట కూడా లేదు.


జ‌గ‌న్‌కూ వీళ్ల‌కూ పెద్ద తేడాలేదేమో...!?

ఎందుకుచేశాం..ఈ గ‌రుడ సేవ‌..అంటూ వారు నిట్టూర్పులు విడుస్తున్నారు. పైగా..త‌మ‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వారిని అంద‌లం ఎక్కిస్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చెప్పిన మాట‌లేమిటి..?  రెడ్‌బుక్‌..అంటూ చేసిన ఉప‌న్యాసాలు ఎటుపోయాయి. నిన్నిటిదాకా..త‌మ గొంతులు కోసిన వారికి శిక్ష‌లెక్క‌డేశార‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చేవారెవ‌రు..? క‌నీసం త‌మ‌పై పెట్టిన అక్ర‌మ కేసులు ఎత్తేయ‌మ‌ని, కోర్టులుచుట్టూ తిరగ‌లేక‌పోతున్నామ‌న్న వారి వేద‌న‌ను ప‌ట్టించుకునే వారెవ‌రు...? అవినీతి, అరాచకాలు చేసిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోమంటే...వారి వ‌ద్ద లెక్క‌లు తీసుకుని..మ‌ళ్లీ వాళ్ల‌నే..కొన‌సాగిస్తే..పార్టీ కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల సంగ‌తేమిటి..? అంతా మాకే తెలుసు..మీరు చేస్తే చేయండి..లేక‌పోతే..లేద‌న్న‌ట్లు ఉన్న అధిష్టానం వైఖ‌రి..పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో మోస‌పోయామ‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. చివ‌ర‌కు..జ‌గ‌న్‌కు... వీళ్ల‌కు పెద్ద తేడా లేన‌ట్లుంది..అనే దాకా..వెళ్లిపోయింది..పార్టీ కార్య‌క‌ర్త‌ల అంత‌రంగం. అత‌నేమో..అరాచ‌కంగా క‌నిపిస్తాడు..వీళ్లు ప్ర‌జాస్వామ్య‌వాదులుగా క‌నిపిస్తారు కానీ..చివ‌ర‌కు..అత‌ని బాట‌లోనే న‌డుస్తార‌నే అభిప్రాయం కార్య‌క‌ర్త‌ల్లో మెల్ల‌గా ప్ర‌భ‌లుతోంది.  ఇది క‌నుక పూర్తిగా వ్యాపిస్తే..భ‌విష్య‌త్తులో పార్టీకి గ‌డ్డుకాల‌మే. ఒక‌వైపు అవ‌కాశం వ‌స్తే..మింగేద్దామ‌ని చూస్తోన్న బిజెపి...మ‌రోవైపు ప్ర‌తీకారంతో ర‌గిలిపోతోన్న జ‌గ‌న్‌లుండ‌గా..కార్య‌క‌ర్త‌లు కాడి వ‌దిలేస్తే..ఇక అంతే సంగ‌తులు..! ఇప్ప‌టికైనా అధిష్టానం...పార్టీపై దృష్టిపెట్టాలి. సామాన్య‌కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల‌ను గుర్తించాలి. అప్పుడే..ఇప్ప‌టికి వారి మ‌నోవేద‌న‌కు, అసంతృప్తికి, విసుగుకు కొంతైనా తెర‌ప‌డుతుంది. అలా కాదు...మా ఇష్టం అంటారా..? ఓకే...ఇక మీ ఇష్టం.!

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ