అదానీ To కాకినాడ పోర్టు...! లోగుట్టు పెరుమాళ్లకెరుక...!?
రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఎవరి ఆట వారు ఆడేస్తున్నారు. ఈ ఆటలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ అసత్యాలు, అర్థసత్యాలతో తమ వాదనలే నిజమని ప్రజలను మభ్యపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నాయి. పనిలో పనిగా..ఇద్దరికీ ఇబ్బంది వచ్చినప్పుడు మరో అంశంపైకి రాజకీయాలను మళ్లిస్తున్నారు. తాజా విషయాలే అందుకు నిదర్శనం. నిన్న మొన్నటి దాకా..అదానీ, జగన్ లంచాల విషయంపై ఇరు పార్టీల నడుమ హోరాహోరి పోరు నడించింది. జగన్‌కు అదానీ దాదాపు రూ.1700 కోట్లు లంచాలు ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొనడంతో..జగన్ పార్టీతో పాటు, ప్రజలు కూడా విస్మయం చెందారు. జగన్ అవినీతి చేస్తాడని తెలుసు కానీ..నేరుగా అవినీతి సొమ్ములు పొందుతాడని ఆయన పార్టీ నాయకులు కూడా ఊహించలేదు. ప్రజలకు మొదటి నుంచీ ఆయనపై నమ్మకం లేదు. ఆయనపై ఆరోపణలు వచ్చిన వెంటనే వారంతా..ఇదే నిజమని నమ్మారు. జగన్ అడ్డంగా దొరికిపోయాడని, ఇంకేముంది...చంద్రబాబు ఆయనను అరెస్టుచేయిస్తారని వారందరూ ఆశించారు. అయితే..ఇదేమీ సాదా సీదా కేసు కాదు. మోడీకి ఇష్టుడైన అదానీ వ్యవహారం కావడంతో..చంద్రబాబు, పవన్‌లు ఇద్దరూ మౌనాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అదానీ అంశంపై పార్లమెంట్ పదే పదే వాయిదా పడుతున్నా...మోడీ దీనిపై స్పందించక పోవడంతో..ఆయన మనస్సులో ఏముందో తెలియక పోవడంతో..అదానీ, జగన్ లంచాల వ్యవహారాన్ని చంద్రబాబు, పవన్‌లు పక్కన పెట్టారు. అయితే..కూటమి ప్రభుత్వం తనపై ఎటువంటి చర్యలు తీసుకునే మార్గం లేకపోవడంతో..జగన్ రెచ్చిపోవడం మొదలు పెట్టారు.
లోగుట్టేమిటో....!?
దీంతో..కూటమి ఒక్కసారిగా రూట్ మార్చి కాకినాడ పోర్ట్ విషయాన్ని ఎత్తుకుంది. అక్రమరేషన్ ఎగుమతులు జరుగుతున్నాయంటూ పవన్ చేసిన కాకినాడ పర్యటనతో...రాజకీయం ఒక్కసారిగా అదానీ నుంచి కాకినాడ పోర్టుకు చేరింది. జగన్ బినామీ అయిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కూటమి నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల కాలంలో కాకినాడ పోర్టు నుంచి కనీసం రూ.50వేల కోట్ల అక్రమ బియ్యం వ్యాపారం జరిగిందంటూ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో హడావుడిగా ఒకరోజు పర్యటనకు పవన్ వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా అక్రమ రేషన్ ఎగుమతుల కోసం పోర్ట్‌కు వచ్చిన షిప్‌ను సీజ్ చేయాలని సినీఫక్కీలో ఇచ్చిన ఆదేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై పలువిధాలైన చర్చ జరుగుతోంది. షిప్‌ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అదంతా కేంద్రం చూసుకుంటుందని, నడిమధ్య పవన్ ఎవరంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మీడియా మొత్తం అదానీ విషయాన్ని వదిలేసి..కాకినాడ బియ్యంపై దృష్టి పెట్టింది. గత ఐదేళ్లలో ఎంత అక్రమ బియ్యం ఎగుమతులయ్యాయి..దీనిలో ఎవరెరు నిందితులు..ఇందులో జగన్‌కు ముట్టిందెంత..? ఇతర రాజకీయనాయకులకు ముట్టిందెంత..అంటూ లెక్కలు తీస్తోంది. ఆరు నెలల క్రితం ఇదే విషయంపై రాద్ధాంతం చేసిన కూటమి ప్రభుత్వం అప్పట్లోనే దీనిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు...? ఇప్పుడు తీరిగ్గా రేషన్ బియ్యం అక్రమాలు అంటూ హడావుడి చేయడం వెనుక ఉన్న లోగుట్టు ఏమిటి..? అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ కలిసి అదానీ అంశం నుండి బయటకు వచ్చేందుకు చేసుకున్న లోగుట్టు ఒప్పందమా..? ఇది..అనే అనుమానాలను పలువురు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద..అదానీ అంశాన్ని మరిచిపోయి..ఇప్పుడు రేషన్ బియ్యం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. జనం కూడా..వారి చుట్టూనే పరిభ్రమిస్తున్నారు.