టిడిపికి అప్రదిష్ట...!
తెలుగుదేశం పార్టీపై రోజు రోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, అవినీతిపై చర్యలు తీసుకోవడంలోదనే...భావనతోపాటు..అవినీతి చేసిన వారితో మిలాఖత్ అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసేవారు అవినీతికి పాల్పడుతున్నారని, అవినీతిపరులకు ప్రోత్సాహం హిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.మంత్రి వర్గంలో కీలకమైన మంత్రి అవినీతిని ప్రోత్సహిస్తున్నాడనే విమర్శలూ వస్తున్నాయి. ఇవి వారి దృష్టికి వెళుతు న్నాయో..లేదో..తెలియదు కానీ..ఈ విషయంలో సత్వరం చర్యలు తీసుకోకపోతే..జగన్ వలే..అవినీతి ముద్రను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవినీతి అధికారులు, అక్రమార్కులైన అధికారుల నుంచి సొమ్ములు తీసుకుని వదిలిపెడుతున్నారనే విమర్శలు, ఆరోపణలు భారీగానే వస్తున్నాయి. కీలక మంత్రులకు లంచాలు ఇచ్చామని సదరు అవినీతి అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. తాము లంచాలు ఇచ్చామని, ఇక తమను ఎవరూ ఏమీ చేయలేరని, వాళ్లు పీకేదేమీ లేదని సవాళ్లు చేస్తున్నారు.
సమాచారశాఖ అవినీతిపరులకు ప్రోత్సాహం...!
గత జగన్ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడిన అప్పటి సమాచారశాఖ కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డిని మళ్లీ ఇక్కడి రప్పిస్తామని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పార్థసారధి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఆరు నెలలు అవుతున్నా ఇంత వరకూ ఆయన చిటికిన వేలిని కూడా తాకలేకపోయారు. అప్పట్లో సమాచారశాఖలో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. జగన్ పత్రికకు దోచిపెట్టారని, అదే విధంగా జగన్ పత్రికలో పనిచేసేవారికి సమాచారశాఖ నుంచి జీతాలు చెల్లించారనే ఆరోపణలతో పాటు, నిధుల దుర్వినియోగం, ఇంకా ఇతర అనైతిక కార్యక్రమాలు చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆయనకు అప్పట్లోసహకరించిన ఉన్నతాధికారుల్లో కొందరిని బదిలీ చేశారు. ఇప్పుడా బదిలీ అయిన వారిని మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వడానికి సంసిద్ధమైపోయారు. వారి వద్ద నుంచి భారీగా సొమ్ములు వసూలు చేసి ఇప్పుడు మళ్లీ అక్కడే పోస్టింగ్‌లు ఇవ్వడానికి సిద్ధమయ్యారనే వార్తలువస్తున్నాయి. ఒకవైపు ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరుగుతుండగానే..మళ్లీ వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం ఏమిటి..? ఇలా చేస్తే అవినీతి ఆరోపణలు రావా..?
నెల్లూరు క్వార్ట్జ్ నుంచి కాకినాడ పోర్టు దాకా ఆరోపణలే..!
తాజాగా కాకినాడ పోర్టు బియ్యం అక్రమ ఎగుమతుల్లో ముఖ్యనేతలు ముడుపులు పొందారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తలో హడావుడి చేసి తరువాత కమీషన్లు ఇవ్వడంతో..నోరెత్తలేదని, ఇప్పుడు నెల్లూరులో క్వార్ట్జ్ గనుల్లో ముఖ్యనేతలకు ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో నిజమెంతో కానీ..ఒక పద్దతి ప్రకారం పార్టీని అప్రదిష్ట పాలుచేయడానికి పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారనిపిస్తోంది. మరోవైపు రాజ్యసభ సభ్యుల విషయంలోనూ పార్టీ అప్రదిష్టను మూటగట్టుకుంటోంది. సానా సతీష్ అనే టిడిపి నాయకుడికి రాజ్యసభ సీటు కట్టబెడుతున్నారని, ఆయన చరిత్ర తెలిసిన వారెవరూ ఆయనకు సీటు ఇవ్వరనే విమర్శలు వస్తున్నాయి. అయితే అధిష్టానం దీన్ని పట్టించుకోకుండా ఆయననే ఖరారుచేస్తుందంటున్నారు. ఇలా ఆరోపణలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తే..అవినీతి ఆరోపణలు ఇంకా వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కీలకనేతలు విస్మరిస్తున్నారు. మొత్తం మీద..ఆరు నెలలకే..అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం పార్టీకి, కీలకనేతలకు మంచికాదు. జగన్ చేశాడు..కదా..తాము చెస్తే..తప్పేమిటని వాదించవద్దు. మళ్లీ ఎన్నికల కోసం..సొమ్ములు సంపాదించాలి కదా..అన్నా...అదీ మంచిది కాదు..జగన్ అవినీతి, అక్రమాలు, అహంకారం సహించలేకే..ప్రజలు ఆయనను పాతాళలోకంలో పాతిపెట్టారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవద్దు.