లేటెస్ట్

విజ‌య్‌కుమార్‌రెడ్డి అవినీతికి..అంతేలేదట‌...!

డిజిట‌ల్ కార్పొరేష‌న్‌నూ దోచేసిన మాజీక‌మీష‌న‌ర్‌

రాష్ట్ర స‌మాచార‌శాఖ మాజీ క‌మీష‌న‌ర్ టి.విజ‌య్‌కుమార్‌రెడ్డి అవినీతిలీలలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఆయ‌న స‌మాచార‌శాఖ క‌మీష‌న‌ర్‌గా ఉన్న‌ప్పుడు చేసిన అవినీతి, అక్ర‌మాలు, అనైతిక కార్య‌క్ర‌మాలను విజిలెన్స్ వెలికితీస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌, ఆయ‌న స‌న్నిహితులు కేవ‌లం స‌మాచార‌శాఖ‌ను మాత్ర‌మే దోచుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే..ఈయ‌న‌గారి అవినీతి డిజిట‌ల్ కార్పొరేష‌న్‌కూ పాకింది. అప్ప‌ట్లో డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఎండిగా ఉన్న వాసుదేవ‌రెడ్డి, విజ‌య్‌కుమార్‌రెడ్డిలు ఇద్ద‌రూ క‌లిసి దొంగ కంపెనీల‌ను సృష్టించి భారీగా దోచుకున్నార‌ని విజిలెన్స్ ఆధారాల‌తో బ‌య‌ట‌పెడుతోంది. అర్హ‌త‌లేని కంపెనీల పేరుతో ఇష్టారాజ్యంగా నిధులు మంజూరు చేసుకుని సొమ్ములు పంచుకున్న‌ట్లు విజిలెన్స్ విచార‌ణ‌లో తేలింది.  స‌మాచార‌శాఖ‌లో భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డిన విజ‌య్‌కుమార్‌రెడ్డి, అప్ప‌ట్లో శాఖ‌ను త‌న గుప్ప‌ట్లో పెట్టుకుని చ‌క్రం తిప్పిన కీల‌క అధికారి..శాఖ‌లోనే కాకుండా ఇత‌ర విష‌యాల్లోనూ భారీగా దోచుకున్నార‌ని ఆధారాల‌తో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. చివ‌ర‌కు ఉద్యోగుల బ‌దీల‌ల్లో కూడా భారీగా లంచాలు మేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చిన్న‌స్థాయి అటెండ‌ర్‌ను బ‌దిలీ చేయాల‌న్నా సొమ్ములు చేతులు మారితేనే చేశార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.


కేంద్ర స‌ర్వీసుల నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన విజ‌య్‌కుమార్‌రెడ్డి స‌మాచార‌శాఖ క‌మీష‌న‌ర్‌గా ఐదేళ్లుపాటు ప‌నిచేశారు. మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి తాబేదారుగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న జ‌గ‌న్ ప‌త్రిక‌కు భారీగా ప్ర‌జ‌ల సొమ్మును దోచిపెట్టారు. ఒక‌వైపు త‌న య‌జ‌మానికి సొమ్ములు దోచిపెడుతూనే, మ‌రోవైపు త‌న జేబులతో పాటు త‌న‌కు స‌న్నిహితంగా ఉన్న అధికారుల జేబులూ నింపేశారు. వంద‌ల కోట్లు జ‌గ‌న్ ప‌త్రిక‌కు దోచిపెట్టిన ఆయ‌న అవుట్‌డోర్‌, సీసీ టీవీల ప్ర‌క‌ట‌న‌లు, ప‌బ్లికేష‌న్‌, కాంట్రాక్టు ఉద్యోగాల భ‌ర్తీ, అక్రిటిడేష‌న్ల మంజూరు త‌దిత‌ర వాటిల్లో కూడా భారీగా దోచుకున్నార‌నేది ఇప్పుడు విచార‌ణ‌లో తేలుతోంది. అప్ప‌ట్లో ప్ర‌క‌ట‌న‌ల విడుద‌ల‌ను సెంట్ర‌లైజ్ చేసేసి, ఇత‌ర శాఖ‌ల వారు నేరుగా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌కుండా, తానే ఇచ్చే విధంగా జీవో తెచ్చుకున్నారు. దీంతో..శాఖ‌లో నిధులు పుష్క‌లంగా ఉండ‌డంతో. . ప్ర‌తిరోజూ..ఏదో ఒక ప‌థ‌కం పేరుతో...జ‌గ‌న్ ప‌త్రిక‌కు యాడ్ విడుద‌ల చేయ‌డంతో పాటు, ఇత‌ర‌త్రా ప్ర‌క‌ట‌న‌ల‌ను విడుద‌ల చేసి..వాటిలో లంచాలు మేసేశారు. ఆయ‌నే కాకుండా అప్ప‌ట్లో కీల‌కంగా ప‌నిచేసిన అధికారికీ దీనిలో వాటా ఉంద‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  త‌న‌కు న‌చ్చిన వారికి, త‌న అవ‌స‌రాలు తీర్చిన వారికి ఇష్టారాజ్యంగా సొమ్ములు పంచిపెట్టారు. 


అనైతిక కార్య‌క్ర‌మాల‌పై విచార‌ణ చేయాలి

స‌మాచార‌శాఖ క‌మీష‌న‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్‌కుమార్‌రెడ్డి కేవ‌లం అవినీతికి మాత్రమే పాల్ప‌డ‌లేద‌ని, అంత‌కు మించి అనైతిక కార్య‌క్ర‌మాలు ఎన్నోచేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. శాఖ‌లో ఎవ‌రిని అడిగినా..ఆయ‌న అనైతిక విష‌యాల గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెబుతారు. అప్ప‌ట్లో నిరంత‌రం కార్యాల‌యంలోనే ఉండే ఆయ‌న అర్థ‌రాత్రి వ‌ర‌కూ అక్క‌డ కార్య‌క‌లాపాలు సాగించారు. త‌న‌కున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని మ‌హిళ‌ల‌ను లోబర్చుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై విజిలెన్స్‌, ఏసీబీ దృష్టిసారించాలి. 


అవినీతి అధికారుల‌కు మ‌ళ్లీ పోస్టింగ్‌లు ఇస్తారా..? 

విజ‌య్‌కుమార్‌రెడ్డితో క‌లిసి అవినీతి య‌జ్ఞం సాగించిన కీల‌క అధికారికి మ‌ళ్లీ అక్క‌డే పోస్టింగ్ ఇవ్వాల‌ని స‌మాచార‌శాఖ మంత్రి వ‌ద్ద పైర‌వీలు సాగుతున్నాయ‌నే ప్ర‌చారంసాగుతోంది. మంత్రి కార్యాల‌య అధికారి ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని, నేడో..రేపో ఆ అవినీతి అధికారికి పోస్టింగ్ ఇస్తార‌నే మాట శాఖ‌లో చెప్పుకుంటున్నారు. స‌చివాల‌యంలో కూడా దీనిపై ప్ర‌చారం సాగుతోంది. వాస్త‌వానికి ఆ అధికారికి వేరే ద‌గ్గ‌ర పోస్టింగ్ ఇవ్వ‌డానికి అంతా సిద్ధ‌మైంది. అయితే స‌ద‌రు అధికారి తాను గ‌తంలో ప‌నిచేసిన చోటే ప‌నిచేస్తాన‌ని, త‌న‌కు అక్క‌డే పోస్టింగ్ ఇవ్వాల‌ని భీష్మించార‌ట‌. దీనితో..ఇప్పుడే అక్క‌డ పోస్టింగ్ ఇస్తే..ఇబ్బంది అవుతుంద‌నే భావ‌న‌తో..ఆగిపోయార‌ని, లేక‌పోతే..ఇప్ప‌టికే ఆ అధికారి మ‌ళ్లీ వ‌చ్చి స‌మాచార‌శాఖ‌లో కూర్చునేవార‌నే ప్ర‌చారం ఉంది. కాగా అవినీతి, అక్ర‌మాల‌కు, అనైతిక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డిన విజ‌య్‌ కుమార్‌రెడ్డిని వెనుక్కు పిలిపిస్తామ‌ని మంత్రి పార్థ‌సార‌ధి అసెంబ్లీ సాక్షిగా స‌భ్యుల‌కు హామీ ఇచ్చారు. అయితే..ఇంత‌వ‌ర‌కూ అటువంటి చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు. పైగా..విజ‌య్‌కుమార్‌రెడ్డి అవినీతిలో భాగ‌స్వాములైన వారికి పోస్టింగ్‌లు ఇవ్వ‌డానికి సిద్ధం కావ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి మంత్రిగారి దృష్టికి ఈ విష‌యం వెళ్లిందో..లేదో..ఆయ‌న‌ను కార్యాల‌య అధికారులు మ‌భ్య‌ పెడుతున్నారో.. తెలియ‌దు కానీ..వారి ఒత్తిడికి త‌లొంచి..అవినీతి అధికారుల‌ను మ‌ళ్లీ పోస్టింగ్‌లు ఇస్తే..మంత్రికి ఇబ్బందులు త‌ప్ప‌వు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ