లేటెస్ట్

‘సునీల్‌’ను కాపాడుతున్నదెవరు..!?

రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ‘రఘరామకృష్ణంరాజు’ హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్‌ అధికారి ‘పివి సునీల్‌కుమార్‌’ను కాపాడుతున్నదెవరనేదానిపై రాజకీయ,అధికార వర్గాలతో పాటు, సామాన్య ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ‘జగన్‌’ అధికారంలో ఉన్నప్పుడు ఆయనను విమర్శించారనే కారణంతో అప్పట్లో ఎంపిగా ఉన్న ‘రఘురామకృష్ణంరాజు’ను అరెస్టు చేసి, కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్యచేయబోయారనే ఆరోపణలు ఐపిఎస్‌ అధికారి ‘సునీల్‌’పై ఉన్నాయి.‘రఘురామ’ను అంతం చేయడానికి వైకాపా పెద్దలు ప్రయత్నించారని, ఆ పని ‘సునీల్‌’ చేయడానికి యత్నించి చివరకు విఫలమయ్యారని ‘రఘురామ’ ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అయితే..విచారణ వేగంగా జరగడం లేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సునీల్‌కుమార్‌’ను ప్రభుత్వం ఎందుకు సస్పెండ్‌ చేయడం లేదని ‘రఘురామకృష్ణంరాజు’ ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా తన కేసు విషయంలో వేగంగా కదలడం లేదని ఆయన విమర్శిస్తున్నారు. తన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సునీల్‌’ అనుచరుడు ‘తులసి’‘టిడిపి’లో ఉన్నారని, ఆయనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయడం లేదని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతేనా..‘తులసిబాబు’కు ‘గుడివాడ’ ఎమ్మెల్యే ‘వెనిగండ్ల రాము’ బహిరంగంగా మద్దతు ఇస్తున్నారని, ఆయనతో మంతనాలు చేస్తున్నారని, ఇది ఎంత వరకు సబబు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కేసులో నిందితుడైన ‘తులసిబాబు’కు టిడిపి ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం ఏమిటి..? అలా మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే ‘రాము’పై అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? దీని వెనుక ఉన్న శక్తులేమిటో..తనకు తెలియదని..? దీన్ని ప్రజలు ఏరకంగా అర్థం చేసుకుంటారో..కూడా తనకు తెలియదని ‘రఘురామ’ చెబుతున్నారు. ‘రఘురామ’ చెబుతోన్నవన్నీ వాస్తవాలు అని తెలిసిన తరువాత కూడా టిడిపి అధిష్టానం ఎందుకు ‘పివి సునీల్‌కుమార్‌’పై చర్యలు తీసుకోవడం లేదు..? అదే విధంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో ఆయనకు ఉన్న సంబంధాలపై ఎందుకు విచారణ జరిపించడం లేదు..? అసలు పార్టీలో ఏమి జరుగుతోంది...? ఎందుకు పార్టీ పెద్దలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘రఘురామకృష్ణంరాజు’కు మద్దతు ఇచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్న టిడిపి కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల నుంచీ వస్తోంది.


‘పివి సునీల్‌కుమార్‌’పై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్న శక్తులు ఏవి..? ఆయనంత బలవంతుడా..? లేక టిడిపి అధిష్టానం ఈ విషయంలో వేచి చూసే ధోరణిని అవలంభిస్తోందా..? చట్టప్రకారం చర్యలు తీసుకుంటే చాలని భావిస్తోందా..? అసలు టిడిపి అధినేత ‘చంద్రబాబు’ ఆయన కుమారుడు ‘లోకేష్‌’లు ఈ విషయంపై ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు..? అయితే..పార్టీ సీనియర్‌ నాయకులు ఈ విషయంపై రెండు రకాలవాదనలు వినిపిస్తున్నారు. దాని ప్రకారం..అప్పుడేదో జరిగిపోయింది...? చేసిన వాళ్లు ‘సునీల్‌కుమార్‌’ అయినా..చేయించిన వారు..అప్పటి పాలకులు...? వారిపై ఇప్పట్లో చర్యలు తీసుకునే అవకాశం లేదు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు...ఆ సమయం వచ్చినప్పుడు..చేయించిన వారితో పాటు ‘సునీల్‌కుమార్‌’ కూడా లోపలికి పోతాడు..? ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకుని ‘సునీల్‌కుమార్‌’ సామాజికవర్గానికి చెందిన వారిని ఎందుకు దూరం చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్లుంది. అదే విధంగా ఇప్పుడు ‘తులసిబాబు’కు మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము’పై చర్యలు తీసుకుంటే..అక్కడ పార్టీ బలహీనపడుతుందన్న భావన పార్టీ అధిష్టానంలో ఉంది. ‘గుడివాడ’లో బలమైన క్రిస్టియన్‌ ఓటర్ల మద్దతు పోకుండా ఉండేందుకే..ఇలా నాన్చుతున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే..ఈ కేసును తేల్చేవరకూ ‘రఘురామకృష్ణంరాజు’ ఊరుకోరు. ఆయన రోజూ..దీనిపై మీడియాలో..రచ్చ రచ్చ చేస్తారు. ఆయనకు తిక్కరేగితో..ఇంతకు ముందు ‘జగన్‌’పై ‘ఢల్లీి’లో చేసినట్లు రోజూ ‘రచ్చబండ’ కార్యక్రమం పెడతారు..? ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా..వెంటనే ఎమ్మెల్యే ‘రాము’తో దీనిపై వివరణ కోరాలి. అదే సమయంలో..ఆధారాలుంటే..‘సునీల్‌కుమార్‌’ను సస్పెండ్‌ చేయాలి. ఇవి చేయకపోతే..‘రఘురామ’నే తలకొరివితో గోక్కునట్లే..! 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ