లేటెస్ట్

రెండు నెలల్లో ‘కూటమి’ కూలుతుందా...!?

‘కాళ్ల పారాణైనా..ఆరణు లేదూ...కాటికి సాగిపోయావా...! అంటూ..కొత్తగా పెళ్లైన పెళ్లికూతురు చనిపోయినప్పుడు పత్రికలు రాస్తుంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటన కాకపోయినా..రాజకీయంగా ‘కూటమి సర్కార్‌’ కూలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారు. ఏడు నెలల క్రితం బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ మరో రెండు నెలల్లో కూలిపోతుందని ‘జగన్‌’ చేస్తోన్న హెచ్చరికలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంకా కాళ్లపారాణి కూడా ఆరలేదు..‘పవన్‌’ అన్నట్లు..ఇంకా హానీమూన్‌ కూడా పూర్తిగా అయిపోలేదు. అంతలోనే..‘కూటమి సర్కార్‌’కు కాలం చెల్లిపోతుందంటూ.. ‘జగన్‌’ బృందం చేస్తోన్న ప్రచారం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. కూటమి కూలడమే కాదు..తాను అధికారంలోకి వస్తానని, ఆ వెంటనే అందరిపై ప్రతీకారం తీర్చుకుంటానని ‘జగన్‌’ చేస్తోన్న ప్రకటనలను కేవలం బెదిరింపులుగానే చూడాలా..? లేక దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా..? అనే సందేహాలు సామాన్యులతో పాటు, రాజకీయ విశ్లేషకుల్లోనూ కలుగుతున్నాయి. 


వాస్తవానికి ‘కూటమి’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రజలు ఆశించిన స్థాయిలో పనిచేయటం లేదనేది నిజమే. పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు ఆశించిన విధంగా ‘టిడిపి కూటమి’ పనిచేయడం లేదు. తాను కక్షసాధింపు రాజకీయాలకు దూరం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మడి కట్టుకుని కూర్చోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు మండిపడుతున్నారు. కక్షసాధింపు రాజకీయాలు చేయకపోయినా..తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నా..ఆయన మీన మేషాలు లెక్కిస్తున్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు చేసిన వారందరూ తమ ముందు రొమ్ము విరుచుకు తిరుగుతున్నా..‘చంద్రబాబు’లో కానీ, ఆయన కుమారుడిలో కానీ ఇసుమంత కదలిక కనిపించడం లేదు. పైగా..తప్పు చేసిన వారితో, అవినీతికి పాల్పడిన వారితో కుమ్మక్కు అవుతున్నారనే భావన సర్వత్రా వ్యాపిస్తున్నా వారిలో చలనం లేదు. ఒక మాజీ ఎంపిపై హత్యాయత్నం చేసిన వారితో టిడిపి ఎమ్మెల్యే కుమ్మక్కు అయితే..అతనిపై చర్యలు కాదు కదా..కనీసం పిలిచి విచారించిన పాపాన పోలేదు. ఆయనొక్కరేనా..వైకాపా నుంచి టిడిపిలోకి వచ్చిన ఓ నాయకుడికి మంత్రి పదవి కట్టబెట్టి పైన కూర్చోబెడితో..ఆయనేమో...టిడిపి కార్యకర్తలను, నాయకులను, సానుభూతిపరులను వేధిస్తున్నారు. ఆయనపైనా చర్యలు లేవు. ఇవి కేవలం ఉదాహరణలే..ఇలాంటి వారు జిల్లాకు ఇద్దరు ముగ్గురుపైనే ఉన్నారు. అయినా..వారివైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఇక అధికారులైతే..ఇష్టారాజ్యం. వైకాపాలో అడ్డగోలుగా పనిచేసిన అధికారులే..ఇక్కడా తిష్టవేసి..ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నా వారిపై చర్యలు నామమాత్రం. ముఖ్యమంత్రి ముందే తమ విశ్వరూపం చూపిస్తున్నా..ఆయన నిస్సహాయంగా, బేలగా వ్యవహరిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ‘కూటమి’ పాలన ఉందా..? లేక వైకాపా పాలనే ఉందా..? అనే చర్చ సామాన్య ప్రజల్లోసాగుతోన్న పరిస్థితుల్లో ‘జగన్‌’ చేసిన బెదిరింపులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 


వాస్తవానికి ‘జగన్‌’ చేసిన బెదిరింపుల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..175మంది ఉన్న శాసనసభలో 164మంది కూటమి సభ్యులే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం కూలడం అంత ఈజీ కాదు. అయితే..పైన ఉన్న పెద్దలు ఏదైనా మంత్రం వేసి ‘పవన్‌’ను పక్కకు లాగినా, బిజెపి తప్పుకున్నా..టిడిపికే స్వంతంగా 136 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.  టిడిపి ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చే ముప్పేమీ లేదు. అయితే..‘చంద్రబాబు’ ఆయన కుమారుడు ‘లోకేష్‌’ వైఖరిపై ‘టిడిపి’లో సీనియర్లు కొంతమంది తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తిగా ఉన్నవారెంతమందో తెలియదు. ఒక వేళ ఆ అసమ్మతి బృందం కనుక భారీగా ఉండి ఉంటే..‘జగన్‌’ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ‘జగన్‌’ను ఓడించ‌డంలో కీలకపాత్ర పోషించిన ‘కమ్మ’లను ‘చంద్రబాబు’ ఆయన కుమారుడు దూరం పెడుతున్నారు. ఈ వర్గం కనుక ఒక్కసారి ఎదురుతిరిగితే..‘జగన్‌’ అన్నమాటలు నిజం అవడానికి ఎంతో సమయం పట్టదు. ఎన్టీఆర్‌ వంటి నాయకుడినే పార్టీ కార్యకర్తలు కాదనుకున్నారు. ఒకసారి కార్యకర్తకూ, అధినేతకూ దూరం పెరిగితే...వారి ఆకాంక్షలు నెరవేరకపోతే..ఇక అంతే...? ఎన్టీఆర్‌ ఉదంతం..అదే చాటి చెప్పింది. అయితే..అప్పట్లో ‘ఎన్టీఆర్‌’కు ప్రత్యామ్మాయం ‘చంద్రబాబు’ కనిపించారు. అయితే....ఇప్పుడు..అటువంటి నేత ‘టిడిపి’లో ఎవరూ లేరు. అయితే..ఇదే విధంగా ‘చంద్రబాబు’ ఆయన తనయుడు ప్రవర్తిస్తే..‘టిడిపి’లో అసంతృప్తిగా ఉన్నవారంతా ‘పవన్‌’ చెంతకో..లేక ‘బిజెపి’ సృష్టించే మరో ‘శిండే’ వైపు వెళతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ‘జగన్‌’ అన్నట్లు మరో రెండు నెలల్లో ఇది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే..ఇప్పుడు ‘చంద్రబాబు’ ఆయన తనయుడు ‘బిజెపి’ పెద్దలను బాగానే సంతృప్తి పరుస్తున్నారు. అవసరానికి మించి ‘మోడీ’ని ఆకాశానికెత్తేస్తున్నారు. ‘మోడీ’కి కోపం రాకుండా ఉండేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. ‘అదానీ, జగన్‌’ అవినీతి కేసులో ‘జగన్‌’ ‘లడ్డూ’లా దొరికినా ‘చంద్రబాబు’ ఉపయోగించుకోలేదు. ఇది మనం చెబుతున్నది కాదు..స్వయంగా ‘చంద్రబాబు’ చెబుతున్నదే. అయితే..‘మోడీ’ ‘చంద్రబాబు’, ఆయన కుమారుడు ఎంత బాగా చూసుకున్నా..తన దత్తపుత్రుడికి అవకాశం ఇవ్వడానికే..ఆయ‌న‌ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఎన్నికలు అయి..ఏడు నెలలు కాక ముందే..ప్రతిపక్ష హోదా కూడా రాని ‘జగన్‌’ రెండు నెలలు, నాలుగు నెలలు..అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.


‘చంద్రబాబు’ వల్ల ఏమీ కాదని, తానే మళ్లీ అధికారంలోకి వస్తానని, తరువాత అంతు తేలుస్తానని ఇప్పటి నుంచే బెదిరింపులకు దిగుతున్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగనని, మౌనంగా ఉంటానంటే..మరోసారి 2019 పునరావృతం అవుతుంది. ఇక్కడో సంగతి చెప్పాలి..గతంలో ఇదే విధంగా ‘జగన్‌’ టిడిపి ప్రభుత్వాన్ని తాను తలచుకుంటే గంటలో కూల్చివేస్తానని ప్రకటించుకున్నారు. దీంతో ‘చంద్రబాబు’ వైకాపాలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకున్నారు. అలా లాగేసుకున్నా..‘జగన్‌’కు నష్టమేమీ జరగలేదు. తరువాత జరిగిన ఎన్నికల్లో ‘జగన్‌’ అపూర్వమైన బలంతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడూ ‘జగన్‌’ అదే రీతిలో రెచ్చిపోతున్నారు. ఇలా రెచ్చిపోతోన్న ‘జగన్‌’కు ఆయన మందిమాగాధులకు ‘చంద్రబాబు’ కళ్లెం వెయకపోతే..మరోసారి అదే చేదు ఫలితాలను చూడాల్సి ఉంది. 2019లో చేదు ఫలితాలను చూసినా..టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులు ‘చంద్రబాబు’పై నమ్మకంతో..ఐదేళ్లు గొప్పపోరాటం చేసి...పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చారు. అయితే..ఈసారి..అటువంటి పరిస్థితి ఉండబోదు. ఎందుకంటే..‘చంద్రబాబు’ ఆయన తనయుడు తమను మోసం చేశారని, వాడుకుని వదిలేశారని టిడిపి కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు, ఆ పార్టీ శ్రేయస్సు కోరుకునేవారు భావిస్తున్నారు. ఒకవేళ ‘చంద్రబాబు’ నేతృత్వంలోని కూటమి అధికారం కోల్పోతే..టిడిపివాళ్లు గతంలో వలే పనిచేయరనే విషయాన్ని తండ్రీకొడుకులు గుర్తుంచుకోవాలి.  

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ