‘లయోలా’వాకర్స్-ప్రభుత్వ అసమర్ధత...!
‘విజయవాడ’ నడిబొడ్డున ఓ విచిత్రం జరుగుతోంది. ఈ విచిత్రం ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజిత రాష్ట్రంలోకానీ ఎప్పుడూ చూడనిది. ఆరోగ్యం కోసం దగ్గరలోని ‘లయోలా’ విద్యాసంస్థలో వాకింగ్ చేసుకుంటామని ప్రజలు కోరుతుంటే..సదరు విద్యాసంస్థ వీల్లేదని, అక్కడ నడవాలంటే..‘బ్రిటన్ రాణి’ అనుమతి తెచ్చుకోవాలని వాకర్స్‌ను తరిమేస్తోంది. అదేమంటే..‘ఇంగ్లాండ్’ నుంచి అనుమతి వస్తేనే..తాము వాకర్స్‌ను వాకింగ్ కోసం లోపలికి రానిస్తామని లేకుంటే..వాళ్లను రానీయమని తేల్చి చెబుతోంది. మరోవైపు వాకర్స్‌ను నడక కోసం లోపలికి రానీయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే..దాన్ని పాటించకుండా, కులాలు, మతాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. దీనికి కొందరు యూట్యూబ్ ఛానెల్స్ ఆజ్యం పోస్తున్నాయి. ఎప్పటి నుంచో తాము అక్కడ నడుస్తున్నామని,ఇప్పుడు హఠాత్తుగా వచ్చిన నష్టం ఏమిటో చెప్పకుండా ‘లయోలా’ యాజమాన్యం తలుపులు మూసేస్తుందని, ఇది సరికాదని అక్కడి ప్రజలు అంటున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నా ‘యాజమాన్యం’ మాత్రం తమ మంకుపట్టును వీడడం లేదు. అసలు ఎందుకు యాజమాన్యం ఇటువంటి వైఖరిని అవలంభిస్తోంది. వాకర్స్ నడిస్తే..వారికి వచ్చిన ఇబ్బంది ఏమిటి..? వాకర్స్ వల్ల సంస్థకు వచ్చే నష్టం ఏమిటో తెలియడం లేదు. దీని వెనుక రాజకీయ, మత శక్తులు ఉన్నాయా..? ఎందుకు కావాలని ఒక విద్యాసంస్థను వివాదాల్లోకి లాగుతున్నారు. ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలో జరుగుతోన్న ‘వాకర్స్’ రగడ ప్రభుత్వ ప్రతిష్టను మండగలుపుతోంది. దాదాపు నాలుగేళ్ల నుంచి జరుగుతోన్న ఈ వివాదంపై కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదనే భావన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ‘లయోలా’ సమస్య రోజు రోజుకు పెరిగిపెద్దదవుతోంది. ప్రభుత్వ పెద్దలు జీవో ఇచ్చినా..యాజమాన్యం పట్టించుకోకుండా మంకుపట్టు పట్టడం సరికాదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంస్థ యాజమాన్యం ఇప్పటికైనా దిగిరావాలి.
రాజీకీ రెండు మార్గాలు...!
‘వాకర్స్’ యాజమాన్యం మధ్య నెలకొన్న రగడ ఆగాలంటే..ముందుగా ‘వాకర్స్’ను వాకింగ్‌కు అనుమతి ఇవ్వాలి. తద్వారా..ఇప్పటి దాకా నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోతాయి. ఈ ఉద్రిక్తలు తగ్గాక...వాకర్స్ అసోషియేషన్‌ను రద్దు చేయాలి. ‘లయోలా’లో యాజమాన్యంతో సంబంధం లేని వాకర్స్ క్లబ్‌ను తొలగించాలి. వాకర్స్ అసోషియోషన్ వల్లే సమస్యలు వస్తున్నాయని యాజయాన్యం చెబుతోంది. దానిలో నిజం ఉంది. వీరంతా..ఏదో ఒక సందర్భాన్ని పురష్కరించుకుని కాలేజీలో సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో విద్యాసంస్థకు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. సభల వల్ల భారీగా జనసముదాయం గుమి గూడటంతో..అక్కడ ఉన్న మొక్కలకు, ఇతర చెట్లకు హాని జరుగుతోంది. అదే విధంగా..రాజకీయ సమావేశాలతో కాలేజీ ప్రాంగణం ఉద్రిక్తలకు కారణం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ‘వాకర్స్ అసోషియేషన్’ను రద్దు చేసి..కేవలం వాకింగ్ కోసమే ‘లయోలా’ ప్రాంగణాన్ని వాడుకోవాలి. వాకింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కనుక ప్రభుత్వ ఉత్తర్వులను కాలేజీ యాజమాన్యం పాటించాలి. అలా కాకుండా మొండిగా వ్యవహరిస్తే ‘లయోలా’ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. తద్వారా విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. కాగా..ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష వైకాపా అప్పుడే రాజకీయాన్ని ప్రారంభించింది. తన పెయిడ్ జర్నలిస్టులను రంగంలోకి దింపి కాలేజీ యాజమాన్యానికి మద్దతుగా రెచ్చగొట్టే ప్రకటనలుచేయిస్తోంది. దీన్ని ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. ‘విజయవాడ’లో మత ఘర్షణలు జరగడానికి లేక ఇక్కడ మతస్వేచ్ఛ లేదని ప్రచారంచేయడానికి వీరు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించింది. ఇది చిలికిచిలికి గాలివాన అయ్యే పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకుని, రెచ్చగొట్టే శక్తులను అణిచివేయాలి.