లేటెస్ట్

అదృష్టవంతుడు ‘చంద్రబాబు’...!?

ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’కు అదృష్టం లేదని, ఆయన కష్టాన్నే నమ్ముకుంటారని చాలా మంది భావిస్తారు. అది నిజమో కాదో..కానీ...రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా అదృష్టవంతుడే. వ్యక్తిగతంగా చూస్తే..సామాన్య రైతు కుటుంబం నుంచి..ఒక రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం అంత తేలికైనపనికాదు. దీనిలో కష్టానిదే ప్రధాన పాత్ర అయినా..అదృష్టం కూడా ఆయన వెన్నంటే ఉంది. ఒకటి..రెండుసార్లూ కాదు..ఏకంగా నాలుగుసార్లు రాజకీయంగా ఆయనను అదృష్టం వరించిందని చెప్పవచ్చు. ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు..ఆయన కష్టానిదే ప్రధాన పాత్ర.ఒక సారి ఎమ్మెల్యే అయిన తరువాత మంత్రి పదవి, ఎన్టీఆర్‌ కుమార్తెతో వివాహం..వంటివి ఆయన అదృష్టవశాత్తు జరిగినవే. ఇవన్నీ 1979 నుంచి 1983 వరకు జరిగిన సంఘటనలు. అయితే..తరువాత ఆయన అదృష్టరేఖ తిరగబడిరది. ఎమ్మెల్యేగా ఓడిపోవడం, తరువాత ఎన్టీఆర్‌తో చేరడం..మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడానికి 1994 వరకూ పట్టింది. అప్పటి వరకూ ఆయన ఎంత కష్టపడ్డా..ఆయనను అదృష్టం వరించలేకపోయింది. అయితే..ఎప్పుడైతే..ఎన్టీఆర్‌ జీవితంలోకి ‘లక్ష్మీపార్వతి’ ప్రవేశించిందో..అప్పటి నుంచి ఆయనను మళ్లీ అదృష్టదేవత కరుణించింది. 1995లో ‘లక్ష్మీపార్వతి’ వల్ల అదృష్టం ఆవరిస్తే..తరువాత..1999లో కార్గిల్‌వార్‌, బిజెపి పొత్తు, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వల్ల ఆయనను మరోసారి అదృష్టం వరించింది. ‘వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పీసీసీ అద్యక్షుడిగా ఉండి ఆ ఎన్నికల్లో ‘కాంగ్రెస్‌’ను నడిపించారు. అయితే..ఆయన అహంకారం, ఆవేశం, ముఠాతత్వంతో గెలవాల్సిన ‘కాంగ్రెస్‌’ ఓడిపోయింది. వై.ఎస్‌ వల్ల ఆయనకు అప్పుడు అదృష్టం వరించగా...తరువాత ఆయన కుమారుడు ‘వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి’ రూపంలో రెండుసార్లు ఆయనను అదృష్టదేవత కరుణించింది. అదెలాగో..తెలుసుకుందాం.

2014లో ఆయనకు ‘వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి’ రూపేణా అదృష్టదేవత వరించింది. అప్పట్లో ఉన్న రాజకీయపరిస్థితుల్లో ‘కాంగ్రెస్‌’ నుంచి బయటకు వచ్చిన ‘జగన్‌’ ఎన్నికల ప్రచారంలో రేసుగుర్రంలా దూసుకుపోతున్నారు. 2014`19 మధ్యలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ ఘనవిజయం సాధించింది. రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా..ఆయన గెలుపు సునాయాసమని అందరూ భావించారు. అయితే..కాంగ్రెస్‌ అధిష్టానం రాష్ట్ర విభజన సమయంలో వ్యవహరించిన తీరుతో..ఒక్కసారిగా దూసుకుపోతున్న ‘జగన్‌’కు బ్రేక్‌లు పడ్డాయి. అప్పట్లో అనుభరాహిత్యంతో ‘జగన్‌’ చేసిన తప్పిదాలు ‘చంద్రబాబు’కు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. దీంతో..మరోసారి అదృష్ట దేవత కరుణతో ఆయన విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే..అప్పటి వరకూ ‘చంద్రబాబు’ పక్షాన ఉన్న ‘అదృష్టదేవత’ ఎన్నికల సమయానికి ‘జగన్‌’వైపు చేరింది. అయితే...ఆ అదృష్టాన్ని ‘జగన్‌’ నిలుపుకోలేకపోయారు. బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారాన్ని అప్పగిస్తే..సంసారం చేయడం చేతకాని వాడిలా...అధికారాన్ని పువ్వుల్లో పెట్టి మళ్లీ ‘చంద్రబాబు’కు అందించారు. అంతులేని అవినీతి, అధికారదుర్వినియోగం, అతితో..‘జగన్‌’ తన చేతిలో ఉన్న అదృష్టాన్ని ‘చంద్రబాబు’ వైపు తరిమేశారు. తనవైపు వస్తోన్న అదృష్టాన్ని ‘చంద్రబాబు’ ఒడిసిపట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ‘జగన్‌’ ‘చంద్రబాబు’కు అదే వరాన్ని అందించబోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ‘జగన్‌’ తన తప్పులు తెలుసుకోకుండా..అదే ముతకభాష వాడుతూ..ఇంకోసారి కూడా ‘చంద్రబాబే’కే అదృష్టాన్ని అందించబోతున్నారు. మద్య యుగాలనాటి మనిషిలా ‘జగన్‌’ తాను మళ్లీ వస్తే..గతం కంటే..నీచంగా, దుర్మార్గంగా ప్రవరిస్తానని, ఎన్నికలకు మరో నాలుగేళ్లు సమయం ఉన్నప్పుడే ప్రకటిస్తున్నారు. గత ఐదేళ్ల దుర్మార్గాలకే బెంబేలెత్తిన ‘ఆంధ్రాజనం’ ఇప్పుడు మరోసారి..రాయలసీమ పాలెగాళ్ల పాలన తెస్తానంటుంటే..బుద్ది ఉన్న ఎవరైనా..ఆయనకు మద్దతు పలుకుతారా..? ఇటువంటి నాయకుడు ఒక ప్రధాన పార్టీకి అధినేతగా ఉండడం..‘చంద్రబాబు’ అదృష్టం కాదాంటారా..? అదృష్టదేవత పదే పదే ‘చంద్రబాబు’ తలుపు తటుతుందంటే..‘జగన్‌’ ఆయన తండ్రి వంటి నేతలే కారణం..దీనిలో రెండోమాటకు తావులేదు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ