లేటెస్ట్

మరోసారి ‘బాబు’కు ‘దేవగౌడ’ దెబ్బ...!?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ‘నారా చంద్రబాబునాయుడు’ ఎవరినీ నమ్మరు..అంటారు...! అదే సమయంలో ఆయనను ఎవరూ నమ్మరని ఆయన వ్యతిరేకులు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే..‘చంద్రబాబు’ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. అయితే..ఆయన కొన్ని సమయాల్లో కొందరు వ్యక్తులకు చేసే సహాయం వల్ల ఆయనే తిరిగి ఇబ్బందులకు గురవుతారు. ఎక్కడో అనామకునిగా ఉన్న వ్యక్తులు ‘చంద్రబాబు’ సహాయం పొంది తరువాత కాలంలో ఆయనపైనే తిరగబడతారు..ఘోరంగా విమర్శిస్తారు.. అవమానిస్తారు.. అవహేళన చేస్తారు..! అయినా ‘చంద్రబాబునాయుడు’ వారి గురించి పట్టించుకోరు. కాలమే సమాధానం చెబుతుందని భరోసాగా ఉంటారు. తాను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటారు. తాజాగా..ఇలా ‘చంద్రబాబు’ సహాయంతో ప్రధాని అయిన ‘దేవగౌడ’ ‘చంద్రబాబు’ను రాజకీయంగా ఇరుకునపెట్టే వ్యాఖ్యలు చేశారు. నిన్న రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల తరువాత ‘ఎన్‌డిఏ’ ఛైర్మన్‌గా ‘చంద్రబాబు’ ఉంటానని పట్టుబట్టారని, దానికి ప్రధాని ‘మోడీ’ అంగీకరించలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ‘బిజెపి’కి స్వంతగా మెజార్టీ రాలేదు. దీంతో ‘బిజెపి’ ‘టిడిపి’ వంటి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే ఈసమయంలో ‘ఎన్‌డిఏ’కు ఛైర్మన్‌ ఉండాలని, కీలకమైన అంశాల్లో ‘ఎన్‌డిఏ’ ఛైర్మన్‌తో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ‘చంద్రబాబు’ కోరారని, కానీ ‘మోడీ’ దీనికి అంగీకరించలేదని ‘దేవగౌడ’ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. అయితే..వాస్తవానికి ఎన్‌డిఏ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇటువంటి అంశాలేవీ చర్చకు రాలేదు. ‘చంద్రబాబు’ ఎటువంటి పదవినీ కోరలేదు. 2024 ఎన్నికల సమయానికి ‘చంద్రబాబు’ రాజకీయంగా బలహీనపరిస్థితుల్లో ఉన్నారు. బిజెపి, జనసేన పార్టీలతో పొత్తుపెట్టుకుని ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూటమి బ్రహ్మాండమైన మెజార్టీ సాధించినా..‘టిడిపి’కి వచ్చిన 16 ఎంపీ సీట్లు కేంద్రంలో కీలకమైనా ‘చంద్రబాబు’ ‘మోడీ’పై ఎటువంటి ఒత్తిడి చేయలేదు. అప్పటికే ‘చంద్రబాబు’ ‘జగన్‌’ చేతిలో ఘోరమైన దెబ్బలు తినిఉన్నారు. చివరకు జీవితంలో ఎప్పుడూ చూడని జైలు జీవితాన్ని చూడాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ‘చంద్రబాబు’ ఎన్‌డిఏ ఛైర్మన్‌ పదవి అడిగారని ‘దేవగౌడ’ చెప్పడం..‘చంద్రబాబు’ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ‘దేవగౌడ’ ‘చంద్రబాబు’ను రాజకీయంగా గతంలో కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టారు. 

1996-98ల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీకి కానీ ఏ ఇతర రాజకీయ పార్టీకి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం లభించలేదు. దీంతో సంకీర్ణ కూటములు అనివార్యమయ్యాయి. అప్పట్లో ‘బిజెపి’ లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా అవతరించినా..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేదు. అయినా లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న ‘బిజెపి’ నుంచి ‘వాజ్‌పేయి’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే..ఈ ప్రభుత్వం 13రోజులకే కూలిపోయింది. దీంతో కాంగ్రెస్‌ బయట నుంచి మద్దతు ఇవ్వడంతో..‘యునైటెడ్‌ కూటమి’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసింది. ఈ కూటమి ఏర్పాటులో ‘చంద్రబాబు’ కీలకంగా వ్యవహరించారు. యునైటెడ్‌ కూటమి ఏర్పాటు తరువాత ప్రధానిగా ఎవరు ఉండాలన్న ప్రశ్న వచ్చింది. దీంతో ‘చంద్రబాబు’ కర్ణాటకకు చెందిన ‘దేవగౌడ’ పేరును ప్రతిపాదించారు. అప్పట్లో ‘దేవగౌడ’ ఎవరో జాతీయస్థాయిలో ఎవరికీ తెలియదు. కానీ..యునైటెడ్‌ కూటమికి కన్వీనర్‌గా ఉన్న ‘చంద్రబాబు’ మిగతా పార్టీలను ఒప్పంచి ‘దేవగౌడ’ను ప్రధానిని చేశారు. అయితే..‘దేవగౌడ’ ప్రధాని అయిన తరువాత ‘చంద్రబాబు’ తీవ్ర ఇబ్బందులు, చికాకులు సృష్టించారు. దేశ ప్రధానిగా ఉండాల్సిన ‘దేవగౌడ’ కర్ణాటక ప్రయోజనాల కోసమే పనిచేశారనే విమర్శలను తెచ్చుకున్నారు. అది ఎట్లా ఉన్నా ‘ఆంధ్రప్రదేశ్‌’ ‘కర్ణాటక’ రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై కట్టిన ‘ఆల్‌మట్టి’ వివాదంలో..‘చంద్రబాబు’ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ‘చంద్రబాబు’పై అప్పటి ‘కాంగ్రెస్‌’ నాయకులు తీవ్రస్థాయిలో దండెత్తేవారు. ‘ఆల్‌మట్టి’ని నిలుపుదల చేయాలని, కేంద్రంలో చక్రం తిప్పే ‘చంద్రబాబు’ ఆ మాత్రం చేయలేరా..? ‘ఆంధ్రా’ ప్రయోజనాలు దెబ్బతింటుంటే..ఈయనేమీ చెస్తున్నారంటూ..కాంగ్రెస్‌ నేతలు నిప్పులు చెరిగారు. ఆ వివాదంలో ప్రధానిగా ఉన్న ‘దేవగౌడ’ ఏకపక్షంగా ‘కర్ణాటక’వైపే నిలవడంతో.. ‘చంద్రబాబు’కి రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. అప్పట్లో ‘చంద్రబాబు’ ‘దేవగౌడ’ను ప్రధానిని చేయడంతోనే..‘ఆంధ్రా’కు అన్యాయం జరిగిందనే విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. అవి తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రతిబింబించాయి. మొత్తం మీద..‘చంద్రబాబు’ దయతో ‘ప్రధాని’ అయిన ‘దేవగౌడ’ అప్పట్లోనే ఆయనకు ఇబ్బందులు సృష్టించారు..ఇప్పుడు మళ్లీ ‘ఎన్‌డిఏ’ ఛైర్మన్‌ పదవి అడిగారంటూ.. మరోసారి ‘చంద్రబాబు’ను ఇరికించారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ