లేటెస్ట్

టిడిపితో కలిసి పోటీచేస్తాం: పవన్‌

వచ్చే ఎన్నికల్లో తాము తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ప్రకటించారు. గురువారం నాడు ఆయన రాజమండ్రిలో జైలులో ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడిని కలిశారు. ‘పవన్‌కళ్యాణ్‌’తో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు ‘చంద్రబాబు’ను పరామర్శించడానికి వచ్చారు. పరామర్శ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు’కు సంఫీుభావం ప్రకటించడానికే తాను వచ్చానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాము టిడిపితో కలిసి పోటీ చేస్తామని, వారితో పొత్తు పెట్టుకుంటామని ‘పవన్‌’ ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకే తాము టిడిపితో కలిసి వెళ్తున్నామని ఆయన చెప్పారు. బిజెపి తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. 

ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయారని, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కొంత మంది అధికారులు చట్టాలను అధిగమించి పనిచేస్తున్నారని, ఇటు వంటి అధికారులు ఆలోచించుకోవాలని ఆయన హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని, పోలీసులు ఇకనైనా మారాలని ఆయన కోరారు. వైకాపా నేతలు యుద్ధం కావాలంటే తాము సిద్ధంగా ఉన్నామని, తప్పులు సరిదిద్దుకోవడానికి ఇంకా ఆరు నెలలు సమయం ఉందని, తప్పులు దిద్దుకోవాలన్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ