అధికారవ్యవస్థ ప్రక్షాళన...!?
కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా..ఇంకా అధికార వ్యవస్థపై పట్టురాలేదనే భావన అధికార కూటమిలో ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీగా అధికారులను బదిలీ చేసి, కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా అట్టిపెట్టింది. ముఖ్యంగా పోలీసు, ఐఏఎస్ వర్గాల్లో ఇంకా కొంత మందికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వారంతా గత ప్రభుత్వానికి అండగా నిలిచారని, జగన్ అక్రమాలకు, అవినీతికి, అరాచకాలకు వంతపాడారని వారిని పక్కన పెట్టారు. అయితే..వారిని పక్కన పెట్టినా...తమకు కావాల్సిన అధికారులను కూటమి ప్రభుత్వం నియమించుకున్నా..అధికార వ్యవస్థలో పట్టు చిక్కలేదు. ఏ అధికారి ఇది తమ ప్రభుత్వమని, ప్రభుత్వ పెద్దలు తమను నమ్మి కీలక బాధ్యతలు అప్పగించారని, ప్రభుత్వానికి మంచిపేరు తేవాలనే ఉద్దేశ్యం ఒక్కరికీ లేదనే భావన వివిధ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కీలకమైన సచివాలయంతో పాటు, వివిధ జిల్లాల కలెక్టర్లు, హెచ్ఓడిలు ప్రభుత్వ ఉద్దేశ్యాలను పక్కన పెట్టి స్వంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టే రివ్యూ సమావేశాలకు,సమీక్షలకు హాజరై వందశాతం సంతృప్తి, 80శాతం సంతృప్తి అంటూ..ఆయనను మునగ చెట్టు ఎక్కిస్తున్నారు. దాంతో..ఆయన అదంతా నిజమేననుకుని సంబరపడిపోతున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత సజావుగా లేవు. నిజం చెప్పాలంటే..ప్రతిపక్షనాయకుడిగా జగన్ లేకుండా ఇంకెవరైనా ఉండి ఉంటే..ఇప్పటికే ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసేవారేమోనన్నభావన ఉంది. ఇప్పుడు ప్రజలంతా జగన్ కంటే ఇది మెరుగైన ప్రభుత్వమే అన్న భావనతో వీళ్లు తప్పులు చేస్తున్నా..సహించి మౌనంగా ఉంటున్నారు. అయితే టిడిపి కార్యకర్తలు, నిజమైన సానుభూతిపరులు ఇప్పటికైనా సమయం మించి పోలేదని, అధికార వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు భారీగా అధికార వ్యవస్థను ప్రక్షాళన చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనస్సులో ఏముందో తెలియదు కానీ..ఇప్పటికిప్పుడు కొన్ని మార్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మార్చిలో నూతన సిఎస్
ఈ నెలాఖరుకు ప్రస్తుతం సిఎస్‌గా ఉన్న విజయానంద్ సర్వీసు నుంచి రిటైర్ అవుతారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ సాయిప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఇప్పటికే జీవో కూడా ఇచ్చేశారు. ఆయన నియామకం ఇక లాంఛనమే. అయితే..విజయానంద్‌కు ఓ మంచి పదవి ఇస్తారని సచివాలయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆయన సేవలను మళ్లీ విద్యుత్ రంగంలో వాడుకుంటారని అంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఆయన విద్యుత్ రంగంలో ఏ ప్రభుత్వం ఉన్నా కీలకంగా ఉంటున్నారు. ఆయనపై కొన్ని ఆరోపణలు ఉన్నా..ఆయన సేవలను వాడుకోవాలని ఆయనకు కీలకమైన పదవి ఇస్తారంటున్నారు.
సిఎంఓలో మార్పులు...!
కాగా నూతన సిఎస్ వచ్చిన తరువాత సిఎంఓలో మార్పులు ఉంటాయంటున్నారు. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న రవిచంద్రను టీటీడీకి ఇన్‌ఛార్జి ఈఓగా నియమించారు. ఆయనను పూర్తిగా అక్కడికే పంపిస్తారనే ప్రచారం ఉంది. ఆయన స్థానంలో ముఖేష్‌కుమార్ మీనాను సిఎంఓకు తెస్తారంటున్నారు. అయితే..రవిచంద్రను మారిస్తే..ఇప్పుడున్న పరిస్థితులు మరింత దిగజారతాయనే భావన అధికార వర్గాల్లో ఉంది. సౌమ్యుడు, వివాదరహితుడు అయిన రవిచంద్రను కొనసాగిస్తారని భావన ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనను పిలిచి మరీ సిఎంఓలో నియమించుకున్నారని, టిటిటీకి మరో సమర్థవంతమైన అధికారిని నియమించే వరకూ రవిచంద్ర ఇన్‌ఛార్జిగా ఉంటారని, తరువాత ఆయన తనస్థానంలోనే ఉంటారనే ప్రచారం ఉంది. కాగా సిఎంఓలో ఉన్న మరో ఇద్దరు యువ ఐఏఎస్‌లను కూడా మారుస్తారంటున్నారు. ఇది చాలా కాలంగా జరుగుతోన్న ప్రచారమే. అయితే..రానున్న రోజుల్లో అధికార మార్పిడి జరిగితే ముఖ్యమంత్రి కార్యాలయ స్వరూపమే మారిపోతుందన్న ప్రచారమూ ఉంది.
కలెక్టర్ల బదిలీలు...!
కాగా ఇటీవల ఏర్పాటు చేసిన రెండు జిల్లాలకు కలెక్టర్లను నియమించాల్సి ఉంది. ఆయా జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ మరి కొందరు కలెక్టర్లను బదిలీ చేస్తారంటున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తారంటున్నారు. వీరితో పాటు గోదావరి జిల్లాలకు చెందిన మరో ఇద్దరిని, రాయలసీమ ప్రాంతంలోని కీలకమైన జిల్లా కలెక్టర్‌నూ బదిలీ చేస్తారంటున్నారు. కాగా ఓ యువ ఐఏఎస్ ధీర్ఘకాలిక సెలవుపై వెళతారనే ప్రచారం ఉంది. వ్యక్తిగత కారణాలతో ఆయన సెలవుపై వెళతారంటున్నారు. మొత్తం మీద..మార్చి నెలలో అధికార వ్యవస్థలో కీలకమైన మార్పులు జరుగుతాయనే ప్రచారం ఉంది.