మ‌రోసారి భారీ ఎత్తున ఐఏఎస్‌ల‌ బ‌దిలీలు...!?

09, Apr 2026

రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రోసారి భారీ ఎత్తున్న ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో కొంత మంది జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేసిన ప్ర‌భుత్వం ఈసారి డిపార్ట్‌మెంట్ హెడ్‌లు, ఇత‌ర కార్య‌ద‌ర్శుల‌ను బ‌దిలీ చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌చివాల‌యంలో ప్ర‌చారం జ‌రుగుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి దాదాపు రెండేళ్లు పూర్తి కావ‌స్తున్నా..ఇంకా కూట‌మి నేత‌ల‌కు అధికార వ్య‌వ‌స్థ‌పై ప‌ట్టురాలేద‌నే భావ‌న ఆ పార్టీల‌నూ, రాజ‌కీయ విశ్లేష‌కుల్లోనూ ఉంది. ప్ర‌స్తుతం వివిధ డిపార్ట‌మెంట్లకు అధిప‌తులుగా ఉన్న‌వాళ్ల‌లో కొంద‌రి ప‌నితీరు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు న‌చ్చ‌లేద‌ని, వారు ఎంత చెప్పినా త‌మ ప‌నితీరు మార్చుకోల‌ద‌ని, ఇక వాళ్ల‌ను న‌మ్మితే న‌ట్టేట మునుగుతామ‌నే భావ‌న‌తో కొంద‌రిని బ‌దిలీ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఈసారి బ‌దిలీల్లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాయిప్ర‌సాద్ మార్క్ ఉంటుంద‌నే ప్ర‌చారం ఉంది. ఆయ‌న సిఎస్‌గా వ‌చ్చిన త‌రువాత అధికార వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడ‌తార‌ని, మొత్తం వ్య‌వ‌స్థ‌పై ప‌ట్టుసాధించి ప్ర‌భుత్వానికి మేలు చేస్తార‌ని కూట‌మిని అభిమానించేవారు భావించారు. దానికి అనుగుణంగానే ఆయ‌న ప‌నిచేస్తున్నారంటున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కూడా ఆయ‌న మాటకు ఎక్కువ విలువ ఇస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. అయితే..ఇప్పుడు బ‌దిలీలు చేయ‌బోయే సీనియ‌ర్ ఐఏఎస్‌ల విష‌యంలో వీరిద్ద‌రూ కూర్చుని చ‌ర్చించుకుంటున్నార‌ని, వీలైతే ఈ వారంలో కానీ..లేక‌పోతే వ‌చ్చేవారంలో కానీ బ‌దిలీలు ఉంటాయ‌నే ప్ర‌చారం ఉంది.


ముఖ్యంగా మున్సిప‌ల్‌శాఖ‌లో బ‌దిలీలు ఉంటాయంటున్నారు. మున్సిప‌ల్‌శాఖ మంత్రి నారాయ‌ణ‌కు ఆ శాఖ కార్య‌ద‌ర్శికి మ‌ధ్య సంబంధాలు బాగా లేవ‌ని, ఆయ‌న‌ను మార్చాల‌ని మంత్రి కోరుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏ విష‌యంలో వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయో తెలియ‌దు కానీ..మున్సిప‌ల్ మంత్రి త‌న శాఖ కార్య‌ద‌ర్శిని బ‌దిలీ చేయాల‌ని కోరుతున్నారని తెలుస్తోంది. కాగా గ‌తంలో చంద్ర‌బాబుకు స‌న్నిహితులుగా ఉన్న కొంద‌రు నాన్ ఐఏఎస్ అధికారుల‌ను ప్ర‌భుత్వం కీల‌క‌మైన పోస్టులు ఇవ్వ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక అధికారి ఈ నెలాఖ‌రుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో చేర‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న కుమార్తె వివాహం ఈ నెల‌లో ఉంద‌ని, అది అయిన త‌రువాత ఆయ‌న ప్ర‌భుత్వంలో కీల‌కంగా ప‌నిచేయ‌బోతున్నార‌ని చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కూడా ఆయ‌న రాక‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌ని, ఇక రావ‌డం లాంఛ‌న‌మే అంటున్నారు. మ‌రోవైపు కీల‌క‌మైన సిఆర్‌డిఏలో మ‌రికొన్ని మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉందంటున్నారు. అదే విధంగా పంచాయితీరాజ్‌లో కీల‌క‌మైన అధికారుల‌ను బ‌దిలీ చేస్తారంటున్నారు. మ‌రోవైపు ముఖ్య‌మంత్రికి స‌న్నిహితమ‌ని చెప్పుకునే ఓ ఐఏఎస్‌ను కూడా కీల‌క‌మైన స్థానానికి బ‌దిలీ ఉంటుందంటున్నారు. ఇదే స‌మ‌యంలో రాయ‌ల‌సీమ‌కు చెందిన ఓ జిల్లా క‌లెక్ట‌ర్‌ను కూడా బ‌దిలీ చేస్తారంటున్నారు. ఆయ‌న‌ను రాష్ట్ర స‌చివాల‌యానికి బ‌దిలీ చేస్తార‌నే ప్ర‌చారం ఉంది.మొత్తం మీద ఈ సారి సీనియ‌ర్ ఐఏఎస్‌ల బ‌దిలీలు భారీగా ఉంటాయి.  ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌ణ చేసే విధంగా ఈ బ‌దిలీలు ఉంటాయంటున్నారు. చూద్దాం ఏమి జ‌రుగుతుందో?  


(0)
(0)

Comments

తాజా పోల్

జ‌గ‌న్ మ‌ళ్లీ గెలుస్తార‌నే భ‌యంతోనే రాజ‌ధాని అమ‌రావ‌తిపై అసెంబ్లీలో తీర్మానం చేశారా?

VOTE PLEASE