మూడు నెలలకోసారి 25/25...! నమ్ముదామా...?
ఎన్నికల సీజన్‌ను కొన్ని పత్రికలు, టీవీ సంస్థలు తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నాయి. ఆయా రాష్ర్టాల్లోని రాజకీయపార్టీలను, ప్రభుత్వాలను మచ్చిక చేసుకుని..ఇంతని ప్యాకేజీ తీసుకుని వారికి అనుకూలంగా పెయిడ్ సర్వేలను వదులుతున్నాయి. అన్ని సర్వేలు ఇలా ఉంటాయని కాదు కానీ, మెజార్టీ సంస్థలు పెయిడ్ సర్వేల్లో భాగస్వాములు అవుతున్నాయి. వేరే రాష్ర్టాల గురించి ఏమో కానీ, మన ఆంధ్రాలో మాత్రం ఈ సర్వేల అరాచకం మితిమీరిపోతోంది. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా, వారికి వారే..ఏవో నెంబర్లు వేసుకుని, ఇదే ప్రజాభిప్రాయమని నొక్కివక్కాణిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు సర్వేలు వదులుతున్నా, అధికార వైకాపా సర్వేలు మాత్రం చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైకాపాకు 25/25కు వస్తాయని ప్రముఖ ఆంగ్లఛానెల్ టైమ్స్‌నౌ ఛానెల్ చెబుతోంది. ఈ సంస్థ ఇప్పుడే కాదు గత రెండున్నరేళ్లుగా ఇదేపాట పాడుతోంది. నిజంగా ఈ సంస్థ సర్వే చేస్తుందా..? చేస్తే ఎవరి అభిప్రాయాలను తెలుసుకుంటుందో తెలియదు కానీ, ప్రతి మూడు నెలలకోసారి పాడిందే పాటరా..పాసిపళ్లదాసుడా..అన్నట్లు 25/25కు అంటూ ఊదరగొడుతుంది. ఒకవైపు మెజార్టీ ప్రజలు అధికార వైకాపా పాలనపై పెదవి విరస్తుంటే వీళ్లు మాత్రం 25/25కుపాట ఆపకుండా పాడుతూనే ఉంటారు. ఎంత పెద్ద ప్యాకేజీ ఇచ్చినా..ఇదేం సర్వే అంటూ..స్వంత పార్టీ నేతలు అవాక్కవుతున్నా వారు మాత్రం తమ పాటను ఆపరు. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో గమనించకుండా, వైకాపా ప్రత్యర్థులంతా ఒకటౌతున్నా..ఆ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందని వీరు పదే పదే చెబుతుంటారు. వాస్తవానికి రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు, కర్షకులు, మధ్యతరగతివారు, దిగువ మధ్యతరగతివారు, వ్యాపారులు, కూలీలు, ఇతర వర్గాలవారు వైకాపా పాలనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు వ్యవహారం, పోలవరం, ప్రత్యేకహోదా, విశాఖస్టీల్‌ప్లాట్ అమ్మకం, మద్యం వ్యవహారం, ఇసుక ధరలు,మితిమీరిన అప్పులు, అవినీతి, అక్రమాలు, అక్రమకేసులు, ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు ఒకటేమిటీ..వ్యవస్థలను నాశనం చేయడంతో పాటు, ప్రాథమిక హక్కలకు భంగం కల్గించడం వంటి అనేక అరాచకాలతో వ్యవస్థను బాగుచేయలేనంతగా దిగజార్చిందనే అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో వ్యక్తం అవుతున్నపరిస్థితుల్లో ఈ సంస్థ మళ్లీ వైకాపానే గెలుస్తుందని సర్వేలు ప్రకటించడం ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేయడమనే భావన మెజార్టీ ప్రజల్లో వ్యక్తం అవుతోంది. వైకాపా గెలుస్తుందంటే కొందరనే నమ్ముతారేమో..కానీ..వారు..25/25 అంటే...నవ్వొస్తుంది. మొత్తం మీద..ఆంధ్రావాళ్లంటే..వాళ్లకెక్కడో చిన్నచూపున్నట్లుంది.