లోకేష్-అమిత్‌షా కలయికపై టిడిపిలో చర్చ...!
కేంద్రహోంమంత్రి అమిత్‌షాను టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న కలవడంపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. నిన్న రాత్రి భారత హోంమంత్రి అమిత్‌షాను టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలు కలిశారు. ఈ సందర్భంగా తమ అధినేత చంద్రబాబును రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం కక్షకట్టి అక్రమంగా అరెస్టు చేసిందని, తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా ముఖ్యమంత్రి జగన్ అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైనా కూడా ఆయన ఫిర్యాదుచేశారు. ఈ విషయంలో హోంమంత్రి ఏ విధమైన భరోసాను ఇచ్చారో తెలియదు కానీ, తెలుగు రాష్ర్టాల్లో ఇదో చర్చనీయాంశం అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి నెలరోజులు దాటుతున్నా ఆయనకు ఎటువంటి ఊరట రావడం లేదు. చంద్రబాబు అరెస్టు అయిన తరువాత నుంచి ఎక్కువ కాలం లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఆయన అప్పటి నుంచి బిజెపి మద్దతు అడుగుతున్నారని, కేంద్రహోంమంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నా అది కుదరడం లేదని, ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆయనకు అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇప్పించారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ కలయికపై పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. ఆశ్చర్యకరంగా టిడిపిలోనే ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది. కొందరు టిడిపి నేతలు అమిత్‌షాను లోకేష్ కలవడం పెద్ద నేరంగా భావిస్తుండగా, మరి కొందరు సమర్థిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేయించిందే..కేంద్రపెద్దలని ప్రత్యక్షంగా, పరోక్షంగా తేలుతున్నా మళ్లీ వారి దగ్గరికే వెళ్లి వారిని బతిమిలాడడం ఏమిటని కొందరు టిడిపి నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక అమిత్‌షా, ప్రధాని మోడీ ఉన్నప్పుడు మళ్లీ వారినే ప్రాధేయపడడం ఎందుకని, చేసే పోరాటం వారిపై నేరుగా చేయాలని వారు అంటున్నారు. ఇప్పటిదాకా వారిని నిందించి మళ్లీ వారి వద్దకు వెళ్లి సాధించేదేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. నాయకుడు జైలులో ఉన్నా, కార్యకర్తలు, నేతలు, పార్టీ అభిమానులు అందరూ వారంతట వారే రోడ్లపైకి వస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో శత్రువును శరణుకోరడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వారి వాదన ఇలా ఉంటే..మరి కొందరి వాదన మరోలా ఉంది. బలవంతుడైన శత్రువుతో పదే పదే పోరాటం చేస్తే ఏమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు రాష్ర్ట ప్రయోజనాల కోసం బిజెపిపై పోరాడితే..ఏమి జరిగిందో వీరికి తెలియదా..? నాడు రాష్ట్రం కోసం చంద్రబాబు బిజెపి పెద్దలతో వైరం పెట్టుకున్నారని, ఆయన కోసం కానీ, ఆయన కుటుంబం కోసం కానీ ఆయన నాడు వారిపై యుద్ధం చేయలేదని, కానీ, నాడు బలవంతుడైన శత్రువు టిడిపిని ఏ విధంగా ఓడించాడో గుర్తించాలని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడూ మరోసారి అదే విధమైన పరిస్థితి ఉందని, చంద్రబాబును జైలులో పెట్టారని, బిజెపి పెద్దల సహకారం లేకుండా జగన్ ఇది చేయరనే సంగతి అందరికీ తెలుసునని, కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన శత్రువును పదే పదే ఢీకొట్టి మరోసారి బలహీనం అవడం తెలివితక్కువ పనేనని వారు అంటున్నారు. రాష్ట్రంలో జగన్‌ను ఓడించేందుకు, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు, ఎంతవరకైనా వెళ్ల వచ్చునని వారు చెబుతున్నారు. నిజానికి లోకేష్ కలిసింది..భారత హోంమంత్రిననే విషయాన్ని విమర్శించేవారు గుర్తించాలని, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని, అరాచకాన్ని హోంమంత్రికి వివిరించారని, అదీ ఆయన ఒక్కరే వెళ్లలేదని, రెండు రాష్ర్టా బిజెపి అధ్యక్షులు ఇందులో ఉన్నారని, దీనిలో రహస్యమేముందని వారు ప్రశ్నిస్తున్నారు. వాళ్ల ఎన్నికల అవసరం కోసమే లోకేష్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చినా..లేక...పురంధేశ్వరి అన్నట్లు చంద్రబాబు అరెస్టులో తమ పాత్ర లేదని చెప్పుకోవాలన్న ఉద్దేశ్యంతో కలిసినా.. టిడిపికి వచ్చే నష్టమేమీ లేదని, వారు అంటున్నారు. లోకేష్ అమిత్‌షాను కలవడంతోనే...టిడిపి, బిజెపి కలిసిపోయినట్లేనని ప్రచారం చేయడంలో అర్థం లేదని వారు చెబుతున్నారు. అదే విధంగా వారి కలయికతోనే చంద్రబాబు బయటకు వస్తారనే వాదన కూడా సరికాదంటున్నారు. మొత్తం మీద..లోకేష్ అమిత్‌షాను కలవడంపై ప్రత్యర్థి పార్టీల కన్నా..టిడిపిలోనే ఎక్కువ చర్చ సాగుతోంది.