చంద్రబాబుకు బెయిల్ మంజూరు
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి జరిగిందని, దానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణం అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయించింది. ఈ కేసులో చంద్రబాబునాయుడు దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయనకు హైకోర్టు ఈ నెల28వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అసలు తనపై పెట్టిన కేసు తప్పుడు కేసని, దాన్ని కొట్టివేయాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంలో ఆయన కేసుపై వాదనలు జరిగిన తరువాత తీర్పును రిజర్వ్ చేశారు. ఆ తీర్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ప్రభుత్వం తనపై దాడి చేస్తోందని, వరుసుగా కేసులు పెడుతూపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మొత్తం మీద ఎన్నికలకు మరో నాలుగైదు మాసాలు మాత్రమే సమయం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబుకు బెయిల్ రావడం టిడిపి నాయకులకు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.