‘ముద్దుకృష్ణమనాయుడు’ కుటుంబంలో మళ్లీ లొల్లి...!?
వైకాపాలోకి ‘ముద్దు’ చిన్నకుమారుడు...!
దివంగత ‘టిడిపి’ మాజీ మంత్రి ‘గాలి ముద్దుకృష్ణమనాయుడి’ కుటుంబంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయనే ప్రచారం సాగుతోంది. ఆయన వారసులు ఇద్దరూ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనే ధ్యేయంతో ఉన్నారు. ‘ముద్దు’ రాజకీయవారసత్వం తనదంటే..తనదని.. ఇద్దరూ వాదించుకుంటూ..ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. ‘ముద్దుకృష్ణంనాయుడు’ మరణించిన తరువాత ఆయన ఇద్దరు కుమారులు రాజకీయవారసత్వం కోసం హోరాహోరిగా పోరాడారు. అయితే..అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న ‘ముద్దు’ మరణిస్తే..వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలను చూసిన ‘చంద్రబాబునాయుడు’ ‘ముద్దు’భార్యకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అనంతరం 2019 ఎన్నికల్లో ‘నగరి’ సీటు కోసం మరోసారి ఇద్దరు వారసులు పోటీపడ్డారు. అయితే..వీరిద్దరి మధ్య రాజీ చేసిన ‘చంద్రబాబు’ ‘ముద్దు’ పెద్దకుమారుడు ‘గాలి భానుప్రకాష్’కు సీటు ఇచ్చింది. అయితే..ఆ ఎన్నికల్లో ‘గాలి భానుప్రకాష్’ స్వల్ప తేడాతో..‘ఆర్.కె.రోజా’పై ఓడిపోయారు. ఆ తరువాత 2024 ఎన్నికల నాటికి ‘ముద్దు’ తనయులు మరోసారి సీటు కోసం రోడ్డెక్కారు. అయితే..టిడిపి అధిష్టానం ‘ముద్దుకృష్ణమనాయుడు’ పెద్ద కుమారుడు ‘భాను ప్రకాష్’ వైపే మొగ్గి ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. ఈ సందర్భంలోనే ‘గాలి ముద్దుకృష్ణమనాయుడు’ చిన్న కుమారుడు ‘వైకాపా’లో చేరాలని భావించారు. అయితే..‘రోజా’ అడ్డుకోవడంతో..అది జరగలేదు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ‘గాలి భానుప్రకాష్’ అప్పట్లో మంత్రిగా ఉన్న ‘రోజా’పై 45వేల మెజార్టీతో విజయం సాధించారు. అయితే..ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత కూడా సోదరుడితో విభేదాలు సద్దుమణగలేదు. సరికదా..! మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘ముద్దుకృష్ణంనాయుడు’ చిన్నకుమారుడు వైకాపాలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఆయనను మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి’ ‘జగన్’ వద్దకు తీసుకెళతారని, ఆయన సమక్షంలో ‘వైకాపా’లో చేర్పిస్తారని తెలుస్తోంది. అయితే..ఈ చేరికను మాజీ మంత్రి ‘రోజా’ అడ్డగిస్తున్నారట. ‘గాలి’ వారసులను ‘వైకాపా’లోకి తీసుకుంటే..వచ్చే ఎన్నికల్లో తనకు మళ్లీ టిక్కెట్ ఇవ్వరని ఆమె భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ‘ముద్దు’ వారసుడి వైకాపా ప్రవేశం ఆగిపోతుందంటున్నారు.
మొత్తం మీద..మాజీ మంత్రి ‘ముద్దుకృష్ణంనాయుడు’ వారసుల లొల్లి మళ్లీ మొదలైందని ‘చిత్తూరు’లో జోరుగా ప్రచారం సాగుతోంది. స్వర్గీయ ‘ముద్దుకృష్ణంనాయుడు’ ‘అన్న ఎన్టీఆర్’కు వీరాభిమాని. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోఉన్న ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ‘చిత్తూరు’ జిల్లా ‘పుత్తూరు’ నియోజకవర్గం నుంచి ఆయన ‘ఐదు’సార్లు గెలుపొందారు. వరుసగా టిడిపి నుంచి నాలుగసార్లు, కాంగ్రెస్ నుంచి ఒకసారి ఆయన గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఆయన ‘నగరి’కి మారారు. ‘2009’లో ఆయన ‘నగరి’ నుంచి గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో ఆయన సినీనటి ‘రోజా’పై స్వల్పతేడాతో ఓడిపోయారు. స్వర్గీయ ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా ‘ముద్దు’ అద్భుతంగా పనిచేశారు. 1995లో టిడిపి చీలినప్పుడు ఆయన ‘లక్ష్మీపార్వతి’వైపు నిలిచారు. తరువాత కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ సరిపడక మళ్లీ ‘టిడిపి’లో చేరారు. ‘ముద్దు’ ‘లక్ష్మీపార్వతి’కి మద్దతుగా ఉన్నప్పుడు ‘చంద్రబాబునాయుడు’పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మంచి వాగ్ధాటి, విషయపరిజ్ఞానం ఉన్న ఆయన రాజకీయంగా రాణించారు.అయితే..ఆయన వారసులు మాత్రం వారసత్వం కోసం హోరాహోరిగా పోరాడుతున్నారు. వీరి వారసత్వ పోరాటానికి కాలమే సమాధానం ఇవ్వాలి.