షర్మిల 5శాతం ఓట్లు సాధిస్తే...జగన్ పని గోవిందా...!?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి ఆయన కుటుంబ సభ్యల నుంచే తీవ్రమైన ఎదురుదాడి మొదలైంది. హఠాత్తుగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఎదురౌతున్న ఈ కుటుంబ దాడికి ఆయన కకావికలం అవుతున్నారు. స్వంత చెల్లెళ్ల నుంచి తనపై జరుగుతోన్న దాడిని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఒకవైపు తన వైఫల్యాలను ఎండగడుతూనే...కుటుంబ రహస్యాలను ఆయన చెల్లి షర్మిల బయటపెడుతున్నారు. ఆమెపై తమ సోషల్ మీడియాతో దాడి చేయిస్తున్నా, ఇతర రకాలుగా వేధిస్తున్నా..ఆమె మాత్రం అన్నపై దాడిని ఆపడం లేదు. వారు ఎంతగా తనను వేధించినా, కించపరిచినా, వ్యక్తిత్వహనానికి పాల్పడ్డా, చివరకు దాడులు చేసినా..తాను మాత్రం జగన్‌పై దాడిని ఆపేది లేదని, ఏం చేసుకుంటారో..చేసుకోండని, ఏం పీక్కుంటారో పీక్కోండని ఆమె సవాల్ విసురుతున్నారు. మరోవైపు స్వంత జిల్లా కడపలో తన బాబాయి వై.ఎస్. వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా రాజకీయంగా జగన్‌ను ఎలా దెబ్బకొట్టాలో..ఆయన ఎలా దెబ్బతింటారో..అన్నదానిపై సమాలోచనలు జరుపుతూనే..ఆయనను దెబ్బతీయడానికి కావాల్సిన ప్రణాళికను రచిస్తున్నారు. ఆమె కానీ, లేదా వివేకానంద సతీమణి కానీ ఎన్నికల బరిలో దిగాలని, తద్వారా జగన్‌ను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉన్నారు. దానికి ఆమె షర్మిలతో కలసి ప్రణాళికను రచిస్తున్నారు. గతంలో వలే ఇప్పుడు వై.ఎస్.కుటుంబం ఏకతాటిపై లేదు. జగన్ ఒకవైపు మిగతా కుటుంబం ఒకవైపు అన్నట్లు పరిస్థితి ఉంది. జగన్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసం గతంలో హోరాహోరిగా పోరాడిన కుటుంబసభ్యులు ఇప్పుడు ఆయనను దించడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే..మరోవైపు టిడిపి,జనసేన పొత్తు పెట్టుకుని జగన్ తో ఎన్నికల సన్నద్ధానికి సిద్ధమైంది. ఒకవైపు బలమైన ప్రత్యర్థులు మరో వైపు కుటుంబ సభ్యులు నుంచి వస్తోన్న దాడి, ఇంకోవైపు టిక్కెట్లు ఇస్తామన్న పోటీ చేయకుండా పారిపోతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలను చూసి జగన్ దడుసుకుంటున్నారు. ఇన్నాళ్లు 175కు..175 అంటూ బీరాలు పోయిన ఆయన ఇప్పుడు తాను ఎంత చిత్తుగా ఓడిపోతానో అన్న చింతతో..రోజులు వెళ్లదీస్తున్నారు. ఇది ఇలా ఉంటే..రోజు రోజుకు బలం పుంజుకుంటున్న షర్మిల ఎన్నికల నాటికి కనీసం 5శాతం ఓట్లను కాంగ్రెస్‌కు సాధించిపెడుతుందని, ఇవన్నీ..అధికార వైకాపాకు చెందిన ఓట్లేనన్న భావన రాజకీయ పరిశీలకుల్లో నెలకొంది. వైకాపాను గుడ్డిగా సమర్థించే క్రిష్టియన్, ముస్లిం,ఎస్సీ,ఎస్టీ వర్గాల్లో ఇప్పుడు షర్మిల వల్ల భారీగా చీలక వచ్చిందని, కనీసం ఆమె 4 నుంచి 5 శాతం ఆయా వర్గాల ఓట్లు చీలుస్తుందని, ఇది వైకాపాను చావుదెబ్బ తీస్తుందనే అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోతే అధికారపార్టీకి మేలు జరుగుతుంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం, లోక్‌సత్తా వంటి పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి అధికార కాంగ్రెస్‌కు మేలు చేసింది. అప్పట్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఈ రెండు పార్టీలు భారీగా చీల్చడం వల్ల, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి రెండోసారి అధికారంలోకి రాగలిగారు. అప్పట్లో రాజశేఖర్‌రెడ్డే ఈ రెండు పార్టీలకు భారీగా సొమ్ములు ఇచ్చి, వారిని ఎన్నికల క్షేత్రంలోకి దింపి విజయానికి మార్గాలు వేసుకున్నారని, ఎన్నికల తరువాత జరిగిన విశ్లేషణలో తేలింది. అయితే..ఇప్పుడు కూడా అటువంటి అవకాశం ఉందని, వై.ఎస్.షర్మిల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని అధికారపార్టీ భావిస్తోంది. ఆమె వల్ల తమకు మేలు జరుగుతుందనే భావన వైకాపాకు చెందిన కొంత మందిలో ఉంది. అయితే..ఆమె వల్ల మేలు జరగదని, ఆమె వల్ల నష్టం జరుగుతుందని అధికారపార్టీ అగ్రనేతలు గుర్తించారు. అందుకే ఆమెపై దాడిని మరింతగా పెంచారు. మొత్తం మీద ఆమె కనుక అనుకున్న విధంగా వైకాపా ఓట్లను చీల్చ గలిగితే..వైకాపాకు చావుదెబ్బ తప్పదు.